ఆ హీరోయిన్ కూడా సింగేసింది

ఆ హీరోయిన్ కూడా సింగేసింది

హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కావడం లేదు ఈ రోజుల్లో. తమకు తెలియని భాష నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అలాగే గొంతు సవరించుకుని పాటలు కూడా పాడేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లలో స్వాతి.. రాశి ఖన్నా లాంటి వాళ్లు తమ సింగింగ్ టాలెంట్ చూపించారు.

ఇప్పుడు మరో కథానాయిక పాట అందుకుంది. ఆమె మరెవరో కాదు.. ‘మహానటి’తో మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్. ‘మహానటి’లో సొంతంగా డబ్బింగ్ చెప్పి మెప్పించిన కీర్తి.. విక్రమ్ సరసన నటించిన కొత్త సినిమా ‘సామి స్క్వేర్’లో పాట కూడా పాడేసింది. ఈ పాటలో మేల్ వాయిస్ విక్రమ్‌దే కావడం విశేషం. వీళ్లిద్దరూ కలిసి ‘పుదు మెట్రో రైల్’ అంటూ సాగే పాటను ఆలపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

నటీనటులతో పాటలు పాడించడం దేవిశ్రీకి కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్.. విజయ్.. ఎన్టీఆర్.. స్వాతి.. ఇంకా చాలామందితో మంచి మంచి పాటలు పాడించాడతను. ఇప్పుడు విక్రమ్-కీర్తిలతో ‘పుదు మెట్రో రైల్’ పాట పాడించాడు. ఇది దేవిశ్రీ స్టయిల్లో చాలా హుషారుగా సాగింది. పాట తాలూకు మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. విక్రమ్.. కీర్తి చాలా సరదాగా.. ఉత్సాహంగా ఈ పాటను ఆలపించారు. ముఖ్యంగా కీర్తి తన చిలిపి హావభావాలతో అలరించింది. విక్రమ్ గతంలో దేవిశ్రీ సంగీతం అందించిన ‘మల్లన్న’ సినిమాలో ఒక పాట పాడిన సంగతి తెలిసిందే.

నిన్న లాంచ్ అయిన ‘పుదు మెట్రో రైల్’ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్ర ఆడియో కూడా హిట్టయింది. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామి స్క్వేర్’ సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దశాబ్దంన్నర కిందట బ్లాక్ బస్టర్ అయిన ‘సామి’కి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు