ప్రోమోలేనా.. సినిమా కూడా బావుంటుందా?

ప్రోమోలేనా.. సినిమా కూడా బావుంటుందా?

తెలుగు సినీ పరిశ్రమలో కొంచెం బ్యాకప్ ఉన్న కుర్రాడు.. సినిమాల్లో అడుగుపెట్టాడంటే మాస్ మసాలా సినిమాలు చేయడానికే చూస్తాడు. ఎక్కడలేని బిల్డప్‌‌లు ఇస్తూ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంటాడు. కానీ నారా రోహిత్ మాత్రం ఈ బాటలో నడవలేదు. నందమూరి.. నారా కుటుంబాల బ్యాకప్ ఉన్నప్పటికీ తన సినిమాల్లో ఎక్కడా బిల్డప్పుల్లేకుండా చూసుకున్నాడు. సామాన్యమైన పాత్రలే చేస్తూ వచ్చాడు. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.

కాకపోతే అతడి సినిమాలతో వచ్చిన సమస్య ఏంటంటే.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వరకు చాలా బాగా అనిపిస్తాయి. కొత్తగా ఉంటాయి. ఆసక్తి రేకెత్తిస్తాయి. కానీ సినిమాలు చూస్తే మాత్రం అంచనాలకు తగ్గట్లు ఉండవు. గత కొన్నేళ్లలో రోహిత్ నుంచి వచ్చిన ‘రాజా చెయ్యి వేస్తే’.. ‘సావిత్రి’.. ‘కథలో రాజకుమారి’ లాంటి సినిమాలు అందుకు రుజువు. ఇలాంటి సినిమాలు అతడి క్రెడిబిలిటీని.. మార్కెట్‌ను బాగా దెబ్బ తీశాయి.

ఇప్పుడు రోహిత్ హీరోగా ‘అనగనగా దక్షిణాదిలో’ అంటూ ఒక సినిమాను అనౌన్స్ చేశారు. రోహిత్ తొలి సినిమా ‘బాణం’ తీసిన చైతన్య దంతులూరి దర్శకత్వం వహించబోయే సినిమా ఇది. రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది ఇన్‌స్టంట్‌గా జనాలకు నచ్చేసింది. రోహిత్ లుక్ కానీ.. పోస్టర్ డిజైనింగ్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి. 1971లో జరిగిన ఒక అజ్ఞాత యుద్ధం గురించి ఈ సినిమాలో చూపిస్తారట. ఇలాంటి పీరియాడిక్ సినిమాలకు ఈ మధ్య మంచి ఆదరణ దక్కుతోంది.

తక్కువ బడ్జెట్లోనూ బలమైన కంటెంట్‌తో యువ దర్శకులు సాహసోపేత ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టర్ వరకు చూస్తే ఇది మరో ‘ఘాజీ’ అవుతుందేమో అన్న అంచనాలు కలుగుతున్నాయి. కానీ రోహిత్ గతంలోనూ ఇలా ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించి.. సినిమాలతో నిరాశ పరిచిన నేపథ్యంలో ఎక్కువ అంచనాలు పెట్టుకోవడమూ మంచిది కాదనిపిస్తోంది. మరి రోహిత్ ఈసారి ఎలాంటి ఔట్ పుట్‌తో వస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English