సంతకం చేయలేదంటున్న ప్రకాష్ రాజ్

సంతకం చేయలేదంటున్న ప్రకాష్ రాజ్

మలయాళ సినీ ఆర్టిస్టుల సంఘం (అమ్మ)లోకి వివాదాస్పద నటుడు దిలీప్‌కు తిరిగి సభ్యత్వం ఇవ్వడంపై చెలరేగిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ‘అమ్మ’ అధ్యక్షడిగా ఈ నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ మీద తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా మోహన్ లాల్‌ను ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు గళం విప్పారు. బిజు కుమార్ దామోదరన్ అనే దర్శకుడు ఈ విషయమై ఏకంగా ముఖ్యమంత్రికి పెద్ద లేఖే రాశారు. ఈ వేడుకకు మోహన్ లాల్‌ను ఆహ్వానించొద్దని.. దీనికి వ్యతిరేకంగా వంద మంది సినీ ప్రముఖులు సంతకాలు చేశారని లేఖలో పేర్కొన్నాడు. ఆ వంద మందిలో ప్రకాష్ రాజ్.. మాధవన్ సహా పలువురి పేర్లున్నాయి.

కానీ ‘అమ్మ’ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మోహన్ లాల్‌ను ఈ వేడుకకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తాము సంతకాలు చేశామన్నది అవాస్తవం అంటూ ఒక్కొక్కరుగా ప్రముఖులు గళం విప్పుతుండటం విశేషం. ప్రకాష్ రాజ్ ముందుగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ‘‘మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా తాఖీదుపై సంతకం చేశానని వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. దిలీప్‌ విషయంలో ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయంపై నాకు విభేదాలు ఉన్నాయి. కానీ మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా సీఎంకు రాసిన లేఖపై సంతకం చేశానన్నది మాత్రం అబద్ధం’ అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు. మరోవైపు సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ తుండియిల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్య్తం చేశాడు. బిజు రాసిన లేఖపై తాను కూడా సంతకం చేయలేదని చెప్పారు. ‘‘మోహన్‌లాల్‌ను కార్యక్రమానికి ఆహ్వానించకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఇదెంత మూర్ఖంగా ఉందో ఆలోచించారా? నేను మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి తాఖీదుపై సంతకం చేయలేదు. ఈ వేడుకకు నన్ను కూడా పిలిచారు. కానీ మోహన్‌లాల్‌ గురించి ఎవరూ ఏమీ చెప్పలేదు. మోహన్‌లాల్‌ ఈ వేడుకకు వద్దంటున్నారంటే నేను కూడా వెళ్లను’’ అని సంతోష్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English