మోహన్ లాల్ ఇమేజ్ ఎంత డ్యామేజైందంటే..

మోహన్ లాల్ ఇమేజ్ ఎంత డ్యామేజైందంటే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‌కు నటుడిగానే కాక.. వ్యక్తిగానూ గొప్ప ఇమేజ్ ఉంది. వివాద రహితుడిగా పేరున్న లాల్.. అనవసర వివాదంలో తల దూర్చి తన ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తుకుంటున్నాడు.

ఇటీవలే మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)కు అధ్యక్షుడైన అనంతరం లాల్.. వివాదాస్పద నటుడు దిలీప్‌ను తిరిగి సంఘంలోకి చేర్చుకోవడం, అతడి సభ్యత్వాన్ని పునరుద్ధరించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయమని.. తన ఒక్కడిదే కాదని లాల్ ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా విమర్శలు ఆగలేదు.

ఒక నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో సూత్రధారిగా భావిస్తున్న దిలీప్ జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు సంగతి ఇంకా ఏమీ తేలకుండానే అతడికి ‘అమ్మ’లో తిరిగి సభ్యత్వం ఇవ్వడంతో మోహన్ లాల్ విమర్శలెదుర్కొన్నాడు. అలాంటి వ్యక్తిని కేరళ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న అవార్డు ప్రదానోత్సవానికి ఆహ్వానించడంపై జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు బిజూకుమార్‌ దామోదరన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు లాల్‌ను పిలవొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఒక నటుడిని (మోహన్‌లాల్‌) పిలిచి అవార్డు గ్రహీతలను అవమానించవద్దని.. రాష్ట్ర సాంస్కృతిశాఖ మంత్రి ఆధ్వర్యంలో సీఎం ఆ అవార్డులను ప్రదానం చేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ విషయంపై 100కు పైగా సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారని వారి జాబితాను సైతం బిజు పంచుకున్నాడు. అందులో నటుడు ప్రకాష్‌రాజ్‌, మాధవన్‌, రాజీవ్‌ రవి, రిమా కలింగల్‌, గీతూ మోహన్‌దాస్‌, శ్రుతి హరిహరన్‌ తదితరుల సంతకాలుండటం విశేషం. ఇంతమంది ప్రముఖులు లాల్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారంటే ఆయన ఇమేజ్ ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English