నష్టపోయిన నిర్మాత మళ్లీ అతడితో..

నష్టపోయిన నిర్మాత మళ్లీ అతడితో..

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే భారీ తనానికి పెట్టింది పేరు. అతడి తొలి సినిమాకే రూ.35 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువైపోవడంతో ఫ్లాప్‌గానే నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అతను చేసిన ‘జయ జానకి నాయక’ పరిస్థితి కూడా అంతే. సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి.
అయినప్పటికీ బడ్జెట్ ఎక్కువైపోవడంతో నిర్మాతకు నష్టాలు తప్పలేదు. ఇప్పుడు శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’ సంగతి ఏమవుతుందో చూడాలి. ఈ చిత్రానికి కూడా బడ్జెట్ బాగా పెరిగిపోయి రూ.40 కోట్లకు చేరినట్లు చెబుతున్నారు.

ఐతే ఈ విషయమై శ్రీనివాస్ మాత్రం కంగారు పడట్లేదు. కథను బట్టే ఖర్చు చేస్తున్నారని.. తన మార్కెట్ చూసుకుని.. అన్ని లెక్కలూ వేసుకునే నిర్మాతలు బడ్జెట్ పెడుతున్నారని.. ఒక్క రూపాయి కూడా వృథాగా మాత్రం పెట్టట్లేదని అతనన్నాడు. తన నిర్మాతలందరూ చాలా హ్యాపీ అని.. మళ్లీ తనతో సినిమాలు చేయడానికి కూడా ఆసక్తితో ఉన్నారని చెప్పాడు.

‘జయజానకి నాయక’ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి తనతో మళ్లీ సినిమా చేయబోతున్నట్లు అతను వెల్లడించాడు. ‘సాక్ష్యం’ సినిమా నిర్మాత అభిషేక్ సైతం ఔట్ పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడని.. ఈ చిత్రానికి మంచి బిజెనెస్ జరిగిందని శ్రీనివాస్ చెప్పాడు. తాము ఈ సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయీ తెరపై కనిపిస్తుందని శ్రీనివాస్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు