వైఎస్ సినిమా తట్టుకోగలదా?

వైఎస్ సినిమా తట్టుకోగలదా?

తెలుగు సినిమాల విడుదల విషయానికి వస్తే సంక్రాంతి కోసం ఉన్నంత పోటీ మరే సీజన్‌కూ ఉండదు. ఆ సీజన్‌కు ఆరు నెలలుండగానే బెర్తులు బుక్ అయిపోతుంటాయి. ప్రతి ఏడాదీ రెండు మూడు భారీ సినిమాలు ఆ పండక్కి రిలీజవుతుంటాయి. ఈసారి ఇప్పటికే మూడు సినిమాలు సంక్రాంతికి షెడ్యూల్ అయి ఉన్నాయి. రామ్ చరణ్-బోయపాటి చిత్రంతో పాటు 'ఎన్టీఆర్', 'ఎఫ్-2' చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ కన్ఫమ్ చేసుకున్నాయి.

అంతటితో బెర్తులు ఫుల్ అయ్యాయనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న 'యాత్ర'ను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం సంకేతాలిచ్చింది. ఐతే సంక్రాంతికి ఇప్పటికే పోటీ ఎక్కువైందనుకుంటే.. ఇది కూడా రేసులోకి రావడంతో అయోమయం నెలకొంది.

మిగతా సినిమాలతో పోలిస్తే 'యాత్ర' భిన్నంగా నిలుస్తుంది. వాటి పోటీ నుంచి ఇది తట్టుకోగలదా అన్నది డౌటు. మిగతా సినిమాలపై ఉన్నంత ఆసక్తి దీనిపై ఉండకపోవచ్చు. 'ఎన్టీఆర్' సినిమా కూడా బయోపిక్కే కానీ.. ఎన్టీఆర్ స్థాయి వేరు. ఆయనకు సినీ నేపథ్యం కూడా ఉంది. సినిమా కూడా సినీ నేపథ్యంలోనే ఎక్కువ సాగుతుంది కాబట్టి దాని పట్ల సినీ ప్రియుల్లో ఉండే ఆసక్తి వేరు. పైగా బాలయ్య హీరోగా నటిస్తుండగా.. క్రిష్ డైరెక్ట్ చేస్తుండటం ఆకర్షణ పెంచేదే. ఇక సంక్రాంతి రేసులో ఉన్న మిగతా రెండు సినిమాలకు క్రేజ్ పరంగా ఢోకా లేదు. కానీ వైఎస్ సినిమా విషయానికి వస్తే.. కేవలం పాదయాత్ర నేపథ్యంలో సినిమా తీస్తే ఏమాత్రం ఆసక్తి ఉంటుందన్నది సందేహం. ఇందులో డ్రామాకు ఏమాత్రం అవకాశం ఉంటుందో చెప్పలేం.

పైగా కొత్త దర్శకుడైన మహి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే పరభాషా నటుడైన మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించాడు. నిజానికి ముందు ఈ సినిమాపై అసలేమాత్రం ఆసక్తి లేనప్పటికీ.. మమ్ముట్టి రాకతో కొంచెం ఆసక్తి ఏర్పడింది. దీని టీజర్ కూడా ఓకే అనిపించింది. కానీ వేరే సమయాల్లో కాకుండా సంక్రాంతికి మూడు భారీ సినిమాల మధ్య దీన్ని రిలీజ్ చేస్తే ఏమాత్రం ఆదరణ ఉంటుంది.. జనాలు దీన్నేమాత్రం పట్టించుకుంటారన్నది మాత్రం సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు