తమిళ ‘అర్జున్ రెడ్డి’కీ అతనే..

తమిళ ‘అర్జున్ రెడ్డి’కీ అతనే..

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ.. సంగీత దర్శకుడిగా చాలా మంచి పేరే సంపాదించాడు రధాన్. ‘అందాల రాక్షసి’ ఒక్కటి చాలు అతడి టాలెంటేంటో చెప్పడానికి. ఈ సినిమా అంతగా ఆడకపోయినా పాటలు మాత్రం ఇప్పటికీ మార్మోగుతుంటాయి. దీని తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ కూడా అతడికి మంచి పేరే తెచ్చింది.

ఇక గత ఏడాది అతడి నుంచి వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే రధాన్ ప్రతిసారీ మంచి ఔట్ పుటే ఇచ్చినా అతడి కెరీర్ మాత్రం అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాతైనా అతడి రాత మారుతుందేమో అనుకుంటే.. ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో రధాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించడం అతడికి చేటు చేసింది. రధాన్ తనను ఎంతగా ఏడిపించిందీ సందీప్ ఇందులో వివరించాడు.

ఆల్రెడీ కమిటైన ‘మనసుకు నచ్చింది’ మినహాయిస్తే మళ్లీ తెలుగులో ఇంకో అవకాశం అందుకోలేకపోయాడు రధాన్. తమిళంలో కూడా అతడి కెరీర్ ఏమంత గొప్పగా లేదు. కానీ ఇప్పుడో మంచి అవకాశం అతడిని వరించింది. తమిళ ‘అర్జున్ రెడ్డి’కి సైతం అతనే సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలాతో పని చేయడానికి ప్రతి సంగీత దర్శకుడూ తపిస్తాడు.

‘వర్మ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కొన్ని నెలల కిందటే మొదలైంది. కానీ ఇప్పటిదాకా సంగీత దర్శకుడిని ఖరారు చేయలేదు. చాలామందిని అనుకుని చివరికి రధాన్‌కే ఆ బాధ్యత అప్పగించాడు బాలా. తెలుగులో రధాన్ అందుబాటులో లేక హర్షవర్ధన్ రామేశ్వర్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నాడు సందీప్. తమిళంలో మాత్రం రధానే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చేయబోతున్నాడు. మరి ఈ అవకాశాన్ని రధాన్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు