ఏం దాచలేదంటున్న షకీలా

ఏం దాచలేదంటున్న షకీలా

ఇండియన్ సినిమాలో ఇప్పుడు బయోపిక్స్ హవా నడుస్తోంది. బాలీవుడ్లో ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి. ఇటీవలే దక్షిణాదిన ‘మహానటి’ పేరుతో సావిత్రి బయోపిక్ తీస్తే దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ చిత్రం సెన్సేషనల్ హిట్టయి మరిన్ని బయోపిక్స్‌కు స్ఫూర్తిగా నిలిచింది. ఎన్టీఆర్, వైఎస్సార్‌ల బయోపిక్స్ కూడా తెలుగులో రెడీ అవుతున్నాయి. మరోవైపు మలయాళ శృంగార చిత్రాలతో దశాబ్దం పాటు యువతను ఒక ఊపు ఊపిన షకీలా జీవిత కథ సైతం వెండి తెరకు ఎక్కబోతోంది. ఇంద్రజీత్ లంకేష్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటి రిచా చద్దా.. షకీలా పాత్రను పోషిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. బాగా తీస్తే సిల్క్ స్మిత సినిమా ‘డర్టీ పిక్చర్’ లాగా ఇది కూడా మంచి విజయం సాధించే అవకాశముంది.

ఈ చిత్రంపై షకీలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సినిమా సెన్సేషనల్‌గా ఉంటుందని ఆమె అంది. తన జీవితంలోని ప్రతి విషయాన్నీ ఈ చిత్ర దర్శకుడికి చెప్పానని.. ఏమీ దాచలేదని షకీలా చెప్పింది. అలా దాచాలనుకుంటే బయోపిక్ తీయడమే వేస్ట్ అని.. అందుకే తాను నిజాయితీగా వ్యవహరించానని అంది. మలయాళ సినీ పరిశ్రమకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు ఇందులో ఉంటాయని ఆమె చెప్పింది. తన పాత్రను పోషిస్తున్న రిచా చద్దాతో కలిసి ఫొటో దిగి దాన్ని మీడియాకు పంచుకుంది షకీలా. రిచా వ్యక్తిత్వం.. తన వ్యక్తిత్వం ఒకేలా ఉంటాయని.. తన పాత్రను ఆమె పోషిస్తుండటం చాలా సంతోషమని.. ఆమె రూపంలో తెరపై తనను తాను చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని షకీలా చెప్పింది. కుటుంబం కోసం తాను అన్నీ విడిచిపెట్టి శృంగార చిత్రాల్లో నటిస్తే తనకు ఒరిగిందేమీ లేదని.. చివరికి తాను ఎవరూ లేని అనాథలా మిగిలిపోయానని షకీలా ఆవేదన వ్యక్తం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు