దుమ్ముదులుపుతున్న జాన్వి సినిమా

దుమ్ముదులుపుతున్న జాన్వి సినిమా

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ కథానాయికగా పరిచయమైన ‘ధడక్’ సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టాక్ ఏమంత గొప్పగా లేదు. యావరేజ్ రివ్యూలే వచ్చాయి. ఐతేనేం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. కొత్త హీరో హీరోయిన్లు నటించిన సినిమా అయినా.. స్టార్ అట్రాక్షన్ లేకపోయినా.. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే ఇండియాలో రూ.34 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తొలి రోజే రూ.8.71 కోట్ల వసూళ్లతో ఆశ్చర్యపరిచిన ‘ధడక్’.. తర్వాతి రోజుల్లో మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టింది. శనివారం 11.04 కోట్లు.. ఆదివారం రూ.13.92 కోట్లు కొల్లగొట్టిందీ చిత్రం. టాక్ ఏమంత గొప్పగా లేకున్నా రెండు, మూడు రోజుల్లో వసూళ్లు మరింత పెరగడం ఆశ్చర్యమే.

విదేశీ వసూళ్లు కూడా కలిపితే వారాంతంలో రూ.45 కోట్ల దాకా కలెక్ట్ చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీదేవి కూతురే ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. ఆమెపై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉందని దీనికి వస్తున్న వసూళ్లను బట్టి తెలుస్తోంది. అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఖేతాన్ దర్శకత్వం వహించాడు. మరాఠీలో ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘సైరాట్’కు ఇది రీమేక్. ఐతే ఒరిజినల్లో ఉన్న సహజత్వం ఇందులో మిస్సయిందని.. రిచ్‌నెస్ ఆపాదించడం ద్వారా ఒరిజినాలిటీని దెబ్బ తీసేశారని క్రిటిక్స్ విమర్శించారు. ఐతే శ్రీదేవి కూతురి పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం అందరూ ప్రశంసలు కురిపించారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న జాన్వికి మంచి భవిష్యత్తు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు