ఫ్లాపుల్లో ఉన్నపుడు నితిన్ సినిమా అడిగాడట

ఫ్లాపుల్లో ఉన్నపుడు నితిన్ సినిమా అడిగాడట

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ది గ్రేట్ కమ్ బ్యాక్ అనే చెప్పాలి. వరుస ఫ్లాపులతో సతమతమైన చాలామంది హీరోల్ని చూశాం. కానీ ఎన్ని ఫ్లాపులు వచ్చినా పోరాటం ఆపకుండా ప్రయత్నాలు కొనసాగించి.. చివరికి మళ్లీ పుంజుకున్న హీరోలు చాలా తక్కువమంది కనిపిస్తారు. అందులో నితిన్ ఒకడు. ‘జయం’.. ‘దిల్’.. ‘సై’ లాంటి సూపర్ హిట్లతో గొప్పగా ఆరంభమైంది అతడి కెరీర్. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులే. ఆ జాబితా ఏకంగా డజను దాటేసింది. చివరికి ‘ఇష్క్’ సినిమాతో అతడి దశ తిరిగింది.

ఈ ఫ్లాపుల పరంపరలో ఉన్నపుడు సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి అతను చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా అగ్ర నిర్మాత దిల్ రాజును కూడా కలిశాడట. నితిన్‌తో చేసిన ‘దిల్’తోనే రాజు నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తర్వాత నిర్మాతగా గొప్ప స్థాయికి ఎదిగాడు.

ఈ నేపథ్యంలో వరుస ఫ్లాపుల్లో ఉండగా నితిన్‌ తనను కలిసి సినిమా చేయమని అడిగినట్లు ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియో వేడుకలో దిల్ రాజు వెల్లడించాడు. ఐతే తామిద్దరం కలిసి సినిమా చేయాలని ఎంతగా ప్రయత్నించినా కుదర్లేదని రాజు తెలిపాడు. దానికి ముందు, తర్వాత కూడా ట్రై చేశామని.. వర్కవుట్ కాలేదని చెప్పాడు రాజు. ఐతే ‘దిల్’ వచ్చిన 15 ఏళ్ల తర్వాత ఇంత కాలానికి తమ కాంబినేషన్లో ‘శ్రీనివాస కళ్యాణం’ సెట్టయిందని.. ఈ సినిమా కోసమే వేరే ప్రాజెక్టులేవీ కుదరలేదేమో అని రాజు అభిప్రాయపడ్డాడు.

ఎంత ఆలస్యం అయినప్పటికీ ఒక అద్భుతమైన సినిమాతో తాము కలిశామని.. ఇది నితిన్ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోతుందని రాజు చెప్పాడు. తమ సంస్థకు కూడా ఇది ప్రత్యేకమైన సినిమా అని.. పెళ్లి గొప్పదనం ఏంటో ఈ సినిమా తెలియజేస్తుందని రాజు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు