కొడుకు కోడలి సినిమా.. నాన్న క్లాప్

కొడుకు కోడలి సినిమా.. నాన్న క్లాప్

ఒక మెస్మరైజింగ్ కాంబినేషన్లో మళ్లీ ఇంకో సినిమా మొదలైంది. ‘ఏం మాయ చేసావె’.. ‘మనం’ సినిమాలతో మెస్మరైజ్ చేసిన అక్కినేని నాగచైతన్య-సమంత జోడీ మళ్లీ వెండితెరపై మెరిసిపోనుంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కలయికలో తొలి సినిమా సోమవారమే శ్రీకారం చుట్టుకుంది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న సినిమాకు ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చైతూ తండ్రి నాగార్జున క్లాప్ ఇవ్వడం విశేషం. ఇటీవలే ఆయన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కోసం బల్గేరియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొని నాగ్ ఇండియాకు తిరిగొచ్చేశారు. వచ్చీ రాగానే తన కొడుకు, కోడలి సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

చైతూ-సామ్‌ లాంటి మ్యాజికల్ పెయిర్.. ‘నిన్ను కోరి’ లాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో మొదట్నుంచి చైతూ-సామ్ భార్యాభర్తలుగానే కనిపిస్తారట. పెళ్లి తర్వాత ఒక జంట మధ్య వచ్చే గొడవలు.. ఇగో క్లాషెస్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట.

ఇందులో మరో కథానాయికకూ చోటుంది. హిందీ సీరియల్స్‌తో పేరు సంపాదించిన దివ్యాంక్ష ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ‘నిన్ను కోరి’కి రచనా సహకారం అందించిన సీనియర్ రైటర్ కోన వెంకట్ ఈ చిత్రానికీ పని చేయనున్నాడు. నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ తీసిన షైన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తెస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు