నాలుగో హిట్టు కొట్టేలా ఉందిగా

నాలుగో హిట్టు కొట్టేలా ఉందిగా

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు వరస హిట్లు రావడం అంటే అదృష్టమే. ప్రేక్షకుల అభిరుచి మారడంతో రొటీన్ సినిమాలు ఆడటం లేదు. దీంతో పెద్ద హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయడం కనాకష్టమైపోతోంది. ఒకటి తీస్తే ఒకటి ఫట్టు అన్నట్టుగానే ఎక్కువమంది పరిస్థితి ఉంది. హీరోయిన్లకు ఈ ఇబ్బంది లేకపోయినా కంటిన్యూగా ఆఫర్లు దక్కించుకోవడమే ఛాలెంజ్ గా ఉంది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మాత్రం ఈ విషయంలో దూసుకుపోతోంది. ఆరునెలల్లో హ్యాట్రిక్ హిట్లు ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఇంతవరకు ఆమె నటించిన రంగస్థలం.. మహానటి.. అభిమన్యుడు సినిమాలు రిలీజయ్యాయి. ఈ మూడూ బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. ఈమధ్య కాలంలో ఇంత తక్కువ టైంలో ఇన్ని హిట్లు సమంతకే వచ్చాయి. ఇవన్నీ కూడా అక్కినేని హీరో నాగచైతన్యతో పెళ్లయ్యాక రిలీజయినవే. ప్రస్తుతం సమంత యు టర్న్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ గా వస్తున్న ఈమూవీలో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రోల్ చేస్తోంది.

తాజాగా యూటర్న్ ఫస్ట్ లుక్ బయటకొచ్చింది. ఇది చూస్తుంటే సమంత ఈ ఏడాది నాలుగో హిట్టు కొట్టేలానే కనిపిస్తోంది. పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండటంతో పాటు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఇందులో ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. పాటలు మినహా యూటర్న్ సినిమా షూటింగ్ పూర్తయింది. పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు