నాగ్-కరణ్.. డీల్ కుదిరిందా?

నాగ్-కరణ్.. డీల్ కుదిరిందా?


గతంలో తరచుగా బాలీవుడ్ సినిమాల్లో నటించిన అక్కినేని నాగార్జున.. దాదాపు దశాబ్దంన్నరగా హిందీ సినిమాల వైపు చూడట్లేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం.. బల్గేరియాలో ఇటీవలే చిత్రీకరణకు కూడా హాజరవడం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇంత విరామం తర్వాత నాగ్ బాలీవుడ్ సినిమాలో నటించడం.. దాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తుండటం ఆసక్తి రేకెత్తించే విషయమే. ఐతే వీరి బంధం ఇక్కడితో ఆగట్లేదని.. మరో డీల్ కూడా కుదిరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరణ్ నిర్మాణంలో తన చిన్న కొడుకు అఖిల్ హీరోగా సినిమాను నిర్మించేందుకు నాగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు.

‘బాహుబలి’ దగ్గర్నుంచి సౌత్ సినిమాల మీద కరణ్ బాగా ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రభాస్, రాణాలతో సినిమాలు చేయడానికి ప్రయత్నించి.. చివరికి రాణాను ఒక సినిమాకు ఒప్పించాడు. ఇప్పుడు అఖిల్ హీరోగా ఆయన హిందీ, తెలుగు భాషల్లో ఓ సినిమా నిర్మిస్తాడని అంటున్నారు. ‘మలుపు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రవిరాజా పినిశెట్టి తనయుడు సత్యప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని కరణ్ టేకప్ చేస్తాడంటున్నారు. ఇది బాలీవుడ్ జనాలకు కూడా రుచించే కథతో తెరకెక్కుతోందని.. కొన్ని కమర్షియల్స్ ద్వారా ఇప్పటికే ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయిన అఖిల్‌తో హిందీ సినిమా నిర్మిస్తే వర్కవుటయ్యే అవకాశం ఉందని కరణ్ భావిస్తున్నాడట. నాగార్జునే ఈ ప్రపోజల్ కరణ్ ముందు పెట్టగా.. అతను ఓకే చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు