చిరు.. ఎమ్మెస్ రాజు.. ఒక ఐదు వేలు

చిరు.. ఎమ్మెస్ రాజు.. ఒక ఐదు వేలు

టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లలో ‘సుమంత్ ఆర్ట్స్’ ఒకటి. ఈ బేనర్ మీద ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారాయన. 80ల నుంచే ఆయన సినిమాలు తీస్తున్నారు. కానీ ఇన్నేళ్లలో ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఎప్పుడూ సినిమా తీయలేదు. కానీ చిరుతో ఆయనకు గొప్ప అనుబంధమే ఉందట. తాను కష్టాల్లో ఉండగా రాజు చేసిన ఓ సాయాన్ని గుర్తుంచుకుని చిరు ఇప్పటికీ ఆయనపై కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటున్నారట. ఈ విషయాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘హ్యాపీ వెడ్డింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు.

రాజు తనయుడైన సుమంత్ అశ్విన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నాగబాబు తనయురాలు కొణిదెల నిహారిక కథానాయిక. ఐతే ఈ వేడుకకు నిహారిక కోసమే చరణ్ వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ తాను ఎమ్మెస్ రాజు కొడుకు కోసమే ఈ వేడుకకు వచ్చినట్లు చెబుతూ.. తన తండ్రికి రాజు చేసిన సాయం గురించి వెల్లడించాడు చరణ్. నెల రోజుల కిందట ఇంట్లో అనుకోకుండా ఎమ్మెస్ రాజు గురించి చర్చ వచ్చిందని.. ఆ సందర్భంగా ఆయన గురించి చిరు ఆసక్తికర విషయం చెప్పినట్లు చరణ్ వెల్లడించాడు.

80వ దశకంలో హీరోగా నిలదొక్కుకొంటున్న సమయంలో చిరంజీవికి ఒక నెల 5 వేలు అవసరం పడ్డాయట. తనతో సినిమాలు చేస్తున్న నిర్మాతల్ని అడిగితే డబ్బులు ఇవ్వలేదట. ఆ సమయంలో ఎమ్మెస్ రాజును అడిగితే.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఐదు వేలు ఇచ్చేసినట్లు తెలిసిందని చరణ్ వెల్లడించాడు. అప్పటికి తన తండ్రితో రాజు సినిమా కూడా ఏమీ చేయట్లేదని.. అయినా ఆ సాయం చేసి ఆదుకున్నారని.. ఆ తర్వాత కొంత కాలానికి తన తండ్రి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చారని.. ఈ సాయాన్ని ఇప్పటికీ గుర్తుంచుకున్నారని.. ఈ విషయం తనకు తెలిసి ఈ ఈవెంట్ కు రావాలని రాజు అడగ్గానే మరో మాట లేకుండా సరే అన్నానని.. ఐతే ఆయన అప్పుడు చేసిన సాయంతో పోలిస్తే తాను చేసింది చాలా తక్కువని చరణ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు