సల్మాన్ విలన్‌గా సుదీప్

సల్మాన్ విలన్‌గా సుదీప్

‘ఈగ’ సినిమాలో విలన్ పాత్రలో కన్నడ నటుడు సుదీప్ ఎంతగా మెప్పించాడో తెలిసిందే. కానీ ఆ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదో.. లేక వచ్చినవాటిని తిరస్కరించాడో తెలియదు కానీ.. ఇక్కడైతే ఆయన కెరీర్ ఊపందుకోలేదు. కానీ ఇందుకు సుదీప్ రిగ్రెట్ అవ్వాల్సిందేమీ లేదు. కన్నడలో ఆయన జోరు మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.

‘ఈగ’ తర్వాత ఇన్నాళ్లకు తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నాడు సుదీప్. మరోవైపు హిందీలోనూ సుదీప్‌కు ఒక పెద్ద అవకాశం వచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌కు సుదీప్ విలన్‌గా నటించబోతున్నాడట. ప్రస్తుతం ‘భరత్’ అనే సినిమాలో నటిస్తున్న సల్మాన్.. దీని తర్వాత ‘దబాంగ్’ సిరీస్‌లో రాబోయే మూడో చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సుదీప్‌ను విలన్‌గా ఎంచుకున్నారట. అతడి పాత్ర చాలా కొత్తగా కూడా ఉండబోతోందట. సుదీప్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఫూంక్’.. ‘రక్తచరిత్ర’ సినిమాల్లో నటించాడు. వాటితో పోలిస్తే సల్మాన్ సినిమా చాలా పెద్దదే. అతడి సినిమాల్లో నటిస్తే వచ్చే గుర్తింపే వేరు. పాత్ర సరిగ్గా పండితే సుదీప్‌కు దేశవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ వచ్చేస్తుంది.

‘దబాంగ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దీనికి కొనసాగింపుగా సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తీసిన ‘దబాంగ్-2’ సరిగా ఆడలేదు. దీంతో ఈసారి దర్శకత్వ బాధ్యతలు ప్రభుదేవాకు అప్పగిస్తున్నారు. ఇంతకుముందు సల్మాన్‌తో ‘వాంటెడ్’ సినిమా తీసి అతడి కెరీర్‌ను గాడిన పెట్టిన ఘనత ప్రభుదేవాదే. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు