ఎఫ్-2.. ఏమిటీ హంగామా

ఎఫ్-2.. ఏమిటీ హంగామా

ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగా ప్రమోట్ చేసి మంచి హైప్ మధ్య సినిమాను రిలీజ్ చేయడం పెద్ద సవాలుగా మారిపోయింది. పెద్ద సినిమాలకు సైతం ప్రమోషన్లు చాలా కీలకంగా మారాయి. ముందు నుంచి పబ్లిసిటీ చేయకపోతే హైప్ రాదు. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండవు. అందుకే సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి ప్రచారం హోరెత్తించేస్తున్నారు. కానీ ఈ క్రమంలో ఫిలిం మేకర్స్ మరీ శ్రుతి మించి పోతుండటంతో అసలుకే మోసం వచ్చేస్తోంది.

దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఎఫ్-2’ విషయంలో ఇలాంటి హడావుడే కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రారంభమైన దగ్గర్నుంచి ప్రచార హడావుడి మొదలైపోయింది. షూటింగ్ తొలి రోజు నుంచి ఆన్ లొకేషన్ ఫొటోలు అదే పనిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఫొటోలు బయటికి వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ఎగ్జైట్ అయిపోతూ తరచుగా ఫొటోలు పెట్టేస్తున్నాడు.

ఈ రోజు షూటింగ్ బాగా జరిగింది.. ఈ రోజు వెంకీ సార్ అదరగొట్టేశారు.. ఈ రోజు వరుణ్ తేజ్ జాయినయ్యాడు.. అంటూ తరచుగా అప్ డేట్లు ఇస్తున్నాడు. తొలి షెడ్యూల్ అయిన సందర్భంగా కూడా గ్రూప్ ఫొటోలు దిగేసి.. చాలా ఎగ్జైట్మెంట్ తో ట్వీట్ చేశాడు. సినిమా నుంచి దాదాపుగా అందరి లుక్స్ బయటపెట్టేశాడతను. ఇలాంటి విషయాల్లో కొంచెం దాచి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ముందే అందరి లుక్స్ పరిచయం చేస్తూ.. ఆన్ లొకేషన్ ఫొటోలు పంచుకుంటే ఇక ఫస్ట్ లుక్స్ లాంటి విషయాల్లో ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది? ప్రచారం మరీ శ్రుతి మించితే జనాలు సినిమాను లైట్ తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ‘ఎఫ్-2’ టీం కొంచెం జోరు తగ్గించాల్సిన అవసరం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు