కొత్తవి వచ్చినా పాత సినిమా జోరు తగ్గలా..

కొత్తవి వచ్చినా పాత సినిమా జోరు తగ్గలా..

కొన్ని నెలల కిందట విడుదలైన ‘రంగస్థలం’ తొలి వారంలో అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకోడమే కాదు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. కొత్త సినిమాలు విడుదలవుతున్నా వాటి ప్రభావం దానిపై పడలేదు. రెండు మూడు వారాల్లో కూడా వసూళ్ల దూకుడు కొనసాగింది. ఐతే ఆ సినిమా రేంజ్ పెద్దది కాబట్టి అది అలా ఆడటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ‘ఆర్ఎక్స్ 100’ అనే చిన్న సినిమా కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తోంది. ఈ చిత్రం జులై 12న విడుదల కాగా.. దాంతో పాటుగా వచ్చిన సినిమాలన్నింటి మీదా పైచేయి సాధించింది. వీకెండ్ తర్వాత కూడా మంచి వసూళ్లతో సాగిన ఈ చిత్రం రెండో వీకెండ్లోనూ జోరు కొనసాగిస్తోంది. ఈ వారాంతంలో ఒకటికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. ఇవేవీ కూడా ‘ఆర్ఎక్స్ 100’ జోరును అడ్డుకోలేకపోయాయి.

శుక్రవారం మార్నింగ్ షో వరకు మాత్రమే కొత్త సినిమాలు కొంత ప్రభావం చూపించాయి. శుక్రవారం రిలీజైన ‘లవర్’.. ‘వైఆఫ్ రామ్’.. ‘ఆటగదరా శివ’.. ఈ మూడు సినిమాలకూ ఆశించిన టాక్ రాలేదు. ఒక్క ‘లవర్’ మాత్రం చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ అది కూడా మార్నింగ్ షో వరకే. మ్యాట్నీకల్లా దాని జోరు తగ్గిపోగా.. ‘ఆర్ఎక్స్ 100’ ఎప్పట్లాగే హవా సాగించింది. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత సినిమా అయినప్పటికీ ఇది.. తొలి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేదు. తొలి రోజైన శుక్రవారం ఈ చిత్ర వసూళ్ల కంటే తొమ్మిదో రోజు ‘ఆర్ఎక్స్ 100’ వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి. నిన్న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ల వసూళ్ల వివరాలు చూస్తేనే కొత్త సినిమాల కంటే ‘ఆర్ఎక్స్ 100’ జోరే ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. మ్యాట్నీ నుంచి దీంతో పోలిస్తే ‘లవర్’ సినిమా వసూళ్లు సగమే ఉన్నాయి. ఇక మిగతా సినిమాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఇక శనివారం రిలీజైన ‘పరిచయం’ గురించి జనాలకు అసలు పట్టింపే లేనట్లుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు