దిల్‌ రాజు వదిలేస్తే మటాషే మరి

దిల్‌ రాజు వదిలేస్తే మటాషే మరి

దిల్‌ రాజు వెనక అండ దండగా శిరీష్‌, లక్ష్మణ్‌, హర్షిత్‌ అంటూ పలువురు వుంటారు కానీ తన బ్యానర్‌ సక్సెస్‌ రేటుకి దిల్‌ రాజే ప్రధాన కారణమని అందరికీ తెలుసు. తను నిర్మించే ఏ చిత్రానికైనా దగ్గరుండి అన్నీ చూసుకోవడం దిల్‌ రాజుకి అలవాటు. అయితే ఈమధ్య ఒకేసారి మల్టిపుల్‌ సినిమాలు తీస్తుండడం వల్ల వివిధ చిత్రాలపై దృష్టి పెట్టడం తన వల్ల కావడం లేదు. ఇందుకోసం శిరీష్‌కి, హర్షిత్‌కి కూడా నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నాడు. హర్షిత్‌ రెడ్డికి ట్రెయినింగ్‌ ఇచ్చి పూర్తిస్థాయిలో ఒక సినిమాని నిర్మించమని 'లవర్‌' చేతిలో పెట్టాడు. కథ ఓకే చేయడం దగ్గర్నుంచి, ఎలా తీయాలి, ఎంతలో తీయాలి అంతా కూడా హర్షిత్‌ చూసుకున్నాడు. చివరకు సినిమా పూర్తయిన తర్వాత దిల్‌ రాజు ఎడిటింగ్‌ విషయంలో కూడా ఇన్‌వాల్వ్‌ అవ్వలేదు.

హర్షిత్‌ జడ్జిమెంట్‌కి విలువ ఇచ్చి ఇది పూర్తిగా అతని సినిమాలా రావాలని దిల్‌ రాజు భావించాడు. అయితే ఈ చిత్రం ఫలితం ఏమిటనేది దిల్‌ రాజు ముందే ఊహించాడని విడుదలకి ముందు పెట్టిన ప్రెస్‌మీట్స్‌తోనే స్పష్టమైంది. నిన్న విడుదలైన ఈ చిత్రానికి తిరస్కారమే ఎదురైంది. దిల్‌ రాజు సినిమాల్లో ఇటీవలి కాలంలో ఇంత ఘోరమైన స్పందన ఏ చిత్రానికీ రాలేదు. కేరింత లాంటి సినిమాకి కూడా టూర్లు వేసి సక్సెస్‌ చేయడానికి అన్ని విధాలా కృషి చేసిన దిల్‌ రాజు 'లవర్‌'ని మాత్రం పూర్తిగా వదిలేసాడు. అతను ఇన్‌వాల్వ్‌ కాకపోతే తన సినిమాలెలా వుంటాయనేది లవర్‌ చూసిన వాళ్ళు తెలుసుకుంటున్నారు.