వివాదంలో దేవరకొండ సినిమా

వివాదంలో దేవరకొండ సినిమా

కొంచెం క్రేజ్ ఉన్న సినిమాలకు కాపీ ఆరోపణలు రావడం సహజమే. ఈ మధ్య ఈ ఒరవడి బాగా పెరిగిపోయింది. అటు తమిళంలో.. ఇటు తెలుగులో అనేక చిత్రాలపై కాపీ ఆరోపణలు వచ్చాయి. తాము రాసుకున్న కథల్ని కాపీ కొట్టి సినమాలు చేస్తున్నారంటూ కొందరు రచయితలు ఆయా సినిమాల విడుదలకు ముందు.. తర్వాత మీడియాలోకి వస్తున్నారు. రచయితల సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘రంగస్థలం’ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంది. ఈ వివాదం ఇటీవలే పరిష్కారమైంది. ఇప్పుడు మరో క్రేజీ మూవీకి సంబంధించి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న క్రేజీ మూవీ ‘గీత గోవిందం’ కథ తనదంటూ నివాస్ అనే రచయిత ఆరోపిస్తున్నాడు.

తాను జోగి నాయుడు హీరోగా ‘వర్జిన్’ పేరుతో ఓ సినిమా చేయాలని అనుకున్నానని.. చాలా ఏళ్ల కిందట అతడికి కథ కూడా చెప్పానని.. కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని నివాస్ అంటున్నాడు. జోగి నాయుడు పరశురామ్‌కు క్లోజ్ అని.. అతను ఈ కథ గురించి చెప్పడంతో అతను ‘గీత గోవిందం’ సినిమా తీశాడని భావిస్తున్నానని.. ఈ చిత్ర ప్రోమోలు చూస్తుంటే ఇది తన కథే అనిపిస్తోందని నివాస్ ఆరోపించాడు. ఈ విషయమై అతను రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు. మరి ఈ వివాదాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ ఎలా డీల్ చేస్తుందో చూడాలి. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందాన్నా నటించిన ఈ  చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈలోపే సమస్యను పరిష్కరించుకుంటారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు