మంచు లక్ష్మి ఆరోపణలు ఆయన మీదేనా?

మంచు లక్ష్మి ఆరోపణలు ఆయన మీదేనా?

తన కొత్త సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’ ప్రమోషన్లలో భాగంగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను ఇండస్ట్రీ చాలామంది చేతిలో మోసపోయానని.. చాలా మంది నుంచి తనకు డబ్బులు రావాల్సి ఉందని ఆమె ఆరోపించింది. మోహన్ బాబు కూతురైన తనను ఎవరు మోసం చేస్తారులే అని అంతా అనుకుంటారని.. కానీ తాను మోసపోయిన మాట వాస్తవమని ఆమె చెప్పింది. సినిమాల వల్ల తాను చాలా డబ్బులు కోల్పోయానని.. ‘గుండెల్లో గోదారి’ తాలూకు అప్పులు ఇప్పటికీ తాను తీరుస్తూనే ఉన్నానని.. తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఆపనని లక్ష్మి అంది. ఈ సందర్భంగా తనను మోసం చేసిన వాళ్ల గురించి ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి తనకు రూ.23 లక్షలు ఇవ్వాలని.. ఆ డబ్బులు ఎగ్గొట్టి మారు పేరుతో సినిమాలు తీస్తున్నాడని మంచు లక్ష్మి ఆరోపించింది.

దీంతో ఆ వ్యక్తి ఎవరా అన్న చర్చ మొదలైంది. ఈ విషయంలో అందరికీ బెల్లంకొండ సురేషే గుర్తుకొస్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన నిర్మాణంలో వచ్చిన ‘రభస’ విడుదలకు ముందు జరిగిన గొడవను గుర్తు చేసుకోవాలి. మంచు లక్ష్మి నిర్మాణంలో తెరకెక్కిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ కోసం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ బిల్డింగ్ సెట్‌ను ఆ తర్వాత వేరే సినిమాలకు అద్దెకివ్వడం మొదలుపెట్టింది లక్ష్మి. ‘రభస’ షూటింగ్ కూడా అందులో జరిగింది. ఐతే అద్దె డబ్బులు చెల్లించకుండానే ఆయన ‘రభస’ విడుదలకు రెడీ కావడంతో లక్ష్మి మనుషులు గొడవ చేశారు. లక్ష్మి, సురేష్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారప్పుడు. ఆ గొడవ అప్పటికి సద్దుమణిగింది. తర్వాత సెటిల్మెంట్ ఏమైందో తెలియదు. ఐతే ఇప్పుడు మంచు లక్ష్మి సురేష్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. బెల్లంకొండ సురేష్.. ఫైనాన్షియర్లతో గొడవల వల్లే తన కొడుకుతో సొంతంగా సినిమాలు తీయట్లేదని.. వేరే నిర్మాతల్ని ముందు పెట్టి సినిమాలు చేస్తున్నారనే ఊహాగానాలున్న నేపసథ్యంలో లక్ష్మి వ్యాఖ్యలు ఆయనకే తగులుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు