ఆ సినిమా నుంచి అల్లు శిరీష్ ఔట్

ఆ సినిమా నుంచి అల్లు శిరీష్ ఔట్

తెలుగులో ఇంకా హీరోగా నిలదొక్కుకోకపోయినా.. పొరుగు భాషల్లో మంచి అవకాశాలే సంపాదించాడు అల్లు శిరీష్. మలయాళంలో మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అతడికి లభించింది. ఆ సినిమా ఆడకపోయినా.. తమిళంలో మరో భారీ ప్రాజెక్టులో అతడికి ఛాన్స్ దక్కింది. సూర్య-కె.వి.ఆనంద్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో శిరీష్‌ ఒక కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు కొన్ని రోజుల కిందటే వెల్లడైన సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రం నుంచి శిరీష్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ విషయమై అతను ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు.

డేట్ల సమస్యతో సూర్య-కె.వి.ఆనంద్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని శిరీష్ తెలిపాడు. తాను హీరోగా నటిస్తున్న ‘ఏబీసీడీ’ సినిమాతో డేట్ల క్లాష్ రావడంతో మరో మార్గం లేక సూర్య సినిమా నుంచి వైదొలగినట్లు అతను వెల్లడించాడు. ఈ విషయం దర్శకుడు కె.వి.ఆనంద్‌కు చెప్పడంతో ఆయన పెద్ద మనసుతో తన నిర్ణయాన్ని అంగీకరించాడన్నాడు. తాను ఆ సినిమాలో నటించాలని చాలా కోరుకున్నానని.. కానీ అనివార్య పరిస్థితుల్లో దూరం కావాల్సి వచ్చిందని.. భవిష్యత్తులో ఈ టీంతో పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. మరి శిరీష్ స్థానంలో కె.వి.ఆనంద్ ఎవరిని తీసుకుంటాడో చూడాలి. ‘ఏబీసీడీ’ చిత్రాన్ని సంజీవ్ అనే కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఏబీసీడీ’కిది రీమేక్. మధుర శ్రీధర్ రెడ్డి.. యాష్ రంగినేని నిర్మాతలు. ఈ చిత్రం కోసం కన్నడ నుంచి జుదా శాందీ అనే ఓ యువ సంగీత దర్శకుడిని తీసుకొస్తున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English