అవిశ్వాసం..రాహుల్‌పై సెటైర్లే సెటైర్లు

అవిశ్వాసం..రాహుల్‌పై సెటైర్లే సెటైర్లు

అవిశ్వాసం చ‌ర్చ‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా పార్ల‌మెంటులో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు జ‌రిగాయి. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటనలు ఒక‌దాని వెంట ఒక‌టి చోటుచేసుకున్నాయి. చ‌ర్చ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోడీతన కళ్లలోకి నేరుగా చూడలేకపోతున్నారని అన్నారు. రాఫెల్ డీల్ గురించి ప్రస్తావిస్తూ ఆ ఒప్పందం వల్ల ప్రధాని మోడీ మిత్రుడికి లాభం చేకూరిందని రాహుల్ ఆరోపించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ప్రధాని మోడీ నవ్వుతూ కనిపించారు.

ప్రధాని నన్ను చూసి నవ్వుతున్నారని, కానీ ఆయనలో ఆందోళన కనిపిస్తున్నదని రాహుల్ అన్నారు. తనను కాకుండా మరోవైపు ప్రధాని చూస్తున్నారని, దాన్ని నేను అర్థం చేసుకోగలను అని, ఎందుకంటే మోడీ అసత్యమాడుతున్నారని రాహుల్ అన్నారు. ఇలా త‌న విమర్శల‌తో విరుచుకుప‌డిన తన ప్రసంగం ముగిసిన తర్వాత .. మోడీ వద్దకు వెళ్లిన రాహుల్‌ ఆయనకు విషెస్ చెప్పారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత మోడీని హగ్ చేసుకున్నారు!

తన ప్రసంగంలో భాగంగా ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. భిన్నమైన రాజకీయవేత్తలు అని అన్నారు. ఆ ఇద్దరూ మన లాంటి వాళ్లు కాదు అని, గెలవడం ఓడిపోవడాన్ని మనం స్వాగతిస్తాం, కానీ ఆ ఇద్దరూ అధికారాన్ని కోల్పోవడాన్ని సహించరు అని రాహుల్ అన్నారు. అధికారం పోతుందన్న భయంతో.. ఇద్దరూ ఆగ్రహంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రైతుల రుణాలను ఎత్తివేస్తామని ప్రధాని అంటారు, కానీ ఆర్థిక మంత్రి మాత్రం ఆ రుణాలను మాఫీ చేయలేమంటున్నారు. ప్రభుత్వంలో ద్వంద వైఖరి ఉందన్నారు. ఇలా విమ‌ర్శ‌లు చేసిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రధాని మోడీని ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ స్టంట్ సభలో ఉన్న సభ్యులందర్నీ షాక్‌కు గురిచేసింది. ``మీ దృష్టిలో నేను పప్పూనే కావచ్చు, నాపై మీకు చాలా ద్వేషం ఉంది, కానీ నాకు మీ మీద కోపం లేదు`` అని రాహుల్ గాంధీ అన్నారు.

మ‌రోవైపు రాహుల్ తీరుపై  సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రిగింది. గ‌తంలో రాహుల్ మాట్లాడుతూ తనకు పార్లమెంట్‌లో మాట్లాడటం అనుమతిస్తే, ఏం జరుగుతుందో భూకంపం వస్తుంది అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని పేర్కొంటూ #BhookampAaneWalaHai అనే హ్యాష్‌ట్యాగ్‌ను సృష్టించిన ప్ర‌ధాని మోడీ మ‌ద్ద‌తుదారులు ఆయ‌న‌పై సెటైర్ల మీద సెటైర్లు వేశారు.  బీజేపీ ఐటీ సెల్‌ అధినేత అమిత్ మాల్వియా సైతం ఓ వీడియోతో రాహుల్‌ గాంధీ అంతకముందు పార్లమెంట్‌ ప్రసంగాన్ని ట్వీట్ చేసి ట్రోల్ చేశారు. బీజేపీ మ‌ద్ద‌తుదారులు చేసిన ఈ క్యాంపెయిన్ ట్విట్ట‌ర్‌లో టాప్‌లో నిల‌వ‌డం కొస‌మెరుపు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు