‘అజ్ఞాతవాసి’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు..

‘అజ్ఞాతవాసి’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు..

తెలుగులో సంగీత దర్శకుడిగా తొలి సినిమాతోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదు. కానీ అనిరుధ్ రవిచందర్‌కు ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వాళ్లిద్దరితో కలిసి అతను చేసిన ‘అజ్ఞాతవాసి’ పెద్ద డిజాస్టర్ కావడంతో దాని తాలూకు ఎఫెక్ట్ అతడిపై పడింది.

ఈ సినిమా విడుదల కాకముందే త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫిక్సయిన అనిరుధ్.. ఆ తర్వాత దాన్నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మళ్లీ అనిరుధ్‌‌కు మరో ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక అతను టాలీవుడ్ కెరీర్‌పై ఆశలు పెట్టుకునే పరిస్థితి ఉండదని అంతా అనుకున్నారు. ఐతే ఇప్పుడు అతను మళ్లీ ఇక్కడో ఛాన్స్ పట్టేసినట్లు సమాచారం.

ఈసారి నాని లాంటి మీడియం రేంజ్ హీరోతో జట్టు కట్టబోతున్నాడు అనిరుధ్. నేచురల్ స్టార్ హీరోగా ‘జెర్సీ’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ బాగా సూటవుతాడని అతడిని ఎంచుకున్నారట. ‘అజ్ఞాతవాసి’ ఫలితం ఎలా ఉన్నా అనిరుధ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అతడి టాలెంట్ ఏంటో రుజువు చేసే సినిమాలు తమిళంలో చాలానే ఉన్నాయి.

నిజానికి ‘అజ్ఞాతవాసి’కి కూడా అతను మంచి సంగీతమే అందించాడు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో అతడికి పేరు రాలేదు. నాని సినిమాకు మరింత బెటర్ ఔట్ పుట్ ఇవ్వడానికి అతను ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. మరి ఈ చిత్రమైనా అతడికి మంచి ఫలితాన్నిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English