రజనీకి భలే విలన్ దొరికాడు

రజనీకి భలే విలన్ దొరికాడు

‘కాలా’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఢీకొట్టే విలన్ కోసం బాలీవుడ్ వైపు చూశాడు దర్శకుడు పా.రంజిత్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా.. నానా పటేకర్ నటన మాత్రం అందరినీ అమితంగా ఆకట్టుకుంది. నానా స్థాయి ఏంటో దక్షిణాది ప్రేక్షకులకు అర్థమైంది. ఇప్పుడు రజనీ కొత్త సినిమా కోసం మరో బాలీవుడ్ విలక్షణ నటుడిని తీసుకొస్తున్నారు.

గత దశాబ్ద కాలంలో బాలీవుడ్లోకి వచ్చిన అత్యుత్తమ నటుల్లో ఒకడైన నవాజుద్దీన్ సిద్ధిఖి.. రజనీకి విలన్‌గా నటించబోతుండటం విశేషం. ప్రస్తుతం సూపర్ స్టార్.. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ కాస్టింగ్‌ సెట్ చేసుకున్నాడు కార్తీక్. విజయ్ సేతుపతి.. ఫాహద్ ఫాజల్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పటికే కన్ఫమ్ అయింది.

కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె సంగతేమో కానీ.. తాజాగా ఇద్దరి పేర్లు ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటన ఇచ్చింది. నవాజుద్దీన్‌తో పాటుగా సిమ్రాన్ ఈ చిత్రంలో నటించబోతున్నట్లు సన్ పిక్చర్స్ ధ్రువీకరించింది.

విలన్‌గా చేసినా.. లీడ్ రోల్ చేసినా.. కమెడియన్ పాత్ర పోషించినా.. నవాజుద్దీన్ తనదైన ముద్ర వేస్తాడు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్-2’ ఒక్కటి చూస్తే చాలు అతడి స్థాయి ఏంటో అర్థమవుతోంది. ‘రామన్ రాఘవ్-2’.. ‘బాబూ ఖాన్ బందూక్ బాజ్’ లాంటి సినిమాల్లో అతను నట విశ్వరూపం చూపించాడు. తొలిసారిగా దక్షిణాదిన సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించబోతుండటంతో అతడికి ఇక్కడ గ్రాండ్ ఎంట్రీ దొరికినట్లే. రజనీ-నవాజ్ పోరు కచ్చితంగా ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు