అన్నీ ‘అర్జున్ రెడ్డి’ స్టయిల్లోనే..

 అన్నీ ‘అర్జున్ రెడ్డి’ స్టయిల్లోనే..

ఆర్ఎక్స్ 100.. గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. దీన్ని చాలామంది ‘అర్జున్ రెడ్డి’తో పోల్చారు. బోల్డ్ కంటెంట్ విషయంలో ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి’ని మ్యాచ్ చేసింది. టేకింగ్ పరంగా కొన్ని చోట్ల ‘అర్జున్ రెడ్డి’ అనుకరణ కనిపిస్తుంది ఇందులో. అలాగే హీరో ఆహార్యం.. అతడి బైక్ డ్రైవింగ్ కూడా ‘అర్జున్ రెడ్డి’  సినిమాను గుర్తుకు తెస్తాయి.

ఐతే మిగతా అంశాల్లో దీనికి.. ‘అర్జున్ రెడ్డి’కి పోలికే లేకపోయినప్పటికీ.. వసూళ్ల విషయంలో మాత్రం ఇది ‘అర్జున్ రెడ్డి’ని గుర్తుకు తెస్తోంది. రెండు నెలలుగా డల్లుగా నడుస్తున్న బాక్సాఫీస్‌కు ఈ చిత్రం మంచి ఊపు తెచ్చింది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆశ్చర్యపరిచింది. ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి.. హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ల కెరీర్లకు ఈ చిత్రం మంచి ఊపు ఇచ్చేలా కనిపిస్తోంది.

‘అర్జున్ రెడ్డి’ బాటలోనే ఇది కూడా వేరే భాషల్లో రీమేక్ అయ్యేలా కనిపిస్తోంది. అజయ్ భూపతికి బాలీవుడ్ నుంచి ఆల్రెడీ రీమేక్ ఆఫర్లు వస్తున్నాయట. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఫాంటమ్’ అధినేతలు.. అజయ్‌ని సంప్రదించారట. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయమని అడిగారట. అతను సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం ఇలాగే బాలీవుడ్ నుంచి ఆఫర్ అందుకుని ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

‘ఆర్ఎక్స్ 100’ తెలుగు వెర్షన్ విషయంలో దొర్లిన లోపాల్ని సరిదిద్దుకుని పకడ్బందీగా స్క్రిప్టు రెడీ చేసుకుంటే హిందీలో ఈ చిత్రం బాగానే ఆడే అవకాశముంది. ఈ తరహా సినిమాలు బాలీవుడ్లో ఆల్రెడీ వచ్చాయి. అక్కడి రైటర్ల హ్యాండ్ పడితే.. ఇది మరింత బెటర్‌గా తయారు కావచ్చు. మరోవైపు ఈ చిత్రం తమిళంలోనూ రీమేక్ అవుతుందని అంటున్నారు.