ట్యాక్సీవాలా ఏమైందబ్బా?

ట్యాక్సీవాలా ఏమైందబ్బా?

‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతను ఇంతకుముందెప్పుడో చేసిన ‘ఏ మంత్రం వేసావె’ సినిమా విడుదలైంది కానీ.. దాన్ని విజయ్ సహా ఎవరూ పట్టించుకోలేదు. అతను గీతా ఆర్ట్స్ బేనర్లో చేసిన రెండు సినిమాలు కొంచెం ముందు వెనుకగా పూర్తయ్యాయి. వాటిలో ముందు రావాల్సింది ‘ట్యాక్సీవాలా’నే.

మే 18నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించారు. ప్రమోషన్ల హడావుడి కూడా కనిపించింది. అంతా ఒకే అనుకున్నాక విడుదలకు పది రోజుల ముంగిట.. వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. ఆ తర్వాత సినిమా జూన్ రిలీజ్ అని విజయే ప్రకటించాడు. కానీ జూన్ వచ్చింది. వెళ్లిపోయింది. ఇప్పుడు జులై నెల కూడా పూర్తి కావస్తోంది. ‘ట్యాక్సీవాలా’ గురించి అసలు ఏ అప్ డేట్ లేదు.

ఇంతలో విజయ్ మరో సినిమా ‘గీత గోవిందం’ తెరమీదికి వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా ముచ్చట్లే కనిపిస్తున్నాయి. విజయ్ కూడా దీని గురించే మాట్లాడుతున్నాడు. ‘ట్యాక్సీవాలా’ ప్రస్తావనే తేవట్లేదు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం వల్లే సినిమా లేటవుతోందని అంటున్నారు. ఐతే ముందు అనుకున్న రిలీజ్ డేట్ నుంచి రెండు నెలలు గడిచాయి. వీఎఫెక్స్ పనుల సంగతి ఈపాటికి తేలిపోవాలి. ఇదేమీ ‘బాహుబలి’ తరహా సినిమా కాదు కదా. మరీ నెలలు నెలలు వీఎఫెక్స్ మీద కూర్చోవడానికి.

చూస్తుంటే.. మొత్తంగా ఔట్ పుట్ విషయంలోనే తేడా వచ్చి.. సినిమాను పక్కన పెట్టారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమా విషయంలో తాను ఎంతమాత్రం జోక్యం చేసుకోకుండా.. విజయ్ అండ్ టీంకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అరవింద్ ఇంతకుముందు చెప్పాడు. ఐతే తర్వాత సినిమా చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇలాగే సినిమాను వదిలేస్తే కష్టమని చెప్పి.. మార్పులు చేర్పులు చేయిస్తున్నారని.. రీషూట్లు కూడా చేయాల్సి ఉందని అంటున్నారు. మరి ఈ చిత్రానికి ఎప్పటికి మోక్షం కలుగుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు