‘అమ్మ’కు చీర పెట్టిన బాలయ్య

‘అమ్మ’కు చీర పెట్టిన బాలయ్య

తన తండ్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ సినిమాను నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం పేరు మోసిన నటీనటుల్ని ఎంచుకుంటున్నాడు. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో తనే నటిస్తున్న బాలయ్య.. తన తల్లి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్‌ను కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఒక్క దక్షిణాది సినిమాలోనూ నటించని విద్య.. బసవతారకం పాత్రను మాత్రం ఒప్పుకోవడం ఆశ్చర్యమే. బాలయ్య, క్రిష్ పట్టుబటి.. భారీ పారితోషకం ఆఫర్ చేసి ఆమెను ఒప్పించారు.

ఇటీవలే విద్య హైదరాబాద్ విచ్చేసి ఈ పాత్ర కోసం ప్రిపేరవుతోంది. ఈ సందర్భంగా ఆమెను బాలయ్య కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. ఆమెను తమ ఇంటికి పిలిచి ప్రత్యేకంగా గౌరవించింది.

బాలయ్య కుటుంబం తనను సంప్రదాయ రీతిలో గౌరవించిన తీరుకు విద్య ముగ్ధురాలైందట. బాలయ్యతో పాటు ఆయన సతీమణి వసుంధర.. సోదరి లోకేశ్వరి.. చిన్న కూతురు తేజస్వి, అల్లుడు.. వీళ్లందరూ కలిసి విద్యను రిసీవ్ చేసుకున్నారు. ఆమెకు లోకేశ్వరి ఖరీదైన చీర పెట్టి గౌరవించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముందు బసవతారకం పాత్ర నిడివి తక్కువే అనుకున్నారట కానీ.. విద్యా రాకతో ఆ పాత్రను పెంచినట్లు చెబుతున్నారు.

గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న విద్య.. ఎన్టీఆర్ సతీమణి పాత్రలో ఎలా ఒదిగిపోతుందో చూడాలి. గత నెలలోనే మొదలైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్.. విరామం లేకుండా సాగిపోతోంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని బాలయ్య-క్రిష్ పట్టుదలతో ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English