‘అర్జున్ రెడ్డి’కి విజయ్ పారితోషకం ఎంత?

‘అర్జున్ రెడ్డి’కి విజయ్ పారితోషకం ఎంత?

గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో అంతకు పది రెట్ల వసూళ్లు రాబట్టింది. సినిమాను కొన్న బయ్యర్లందరూ భారీగా లాభాలు అందుకున్నారు. ఈ చిత్ర దర్శక నిర్మాత సందీప్ రెడ్డి వంగా ముందే సినిమాను మంచి లాభానికి అమ్మడమే కాక.. రీమేక్, డిజిటల్, శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా భారీగా ఆదాయం అందుకున్నాడు.

మరి ఈ సినిమాకు విజయ్ దేవరకొండకు దక్కిన పారితోషకం ఎంత అన్నది తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఆ మొత్తం కేవలం రూ.5 లక్షలట. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించాడు. ఇటీవలే ‘రౌడీ’ పేరుతో అపారెల్ బ్రాండ్ ను ఆవిష్కరించిన సందర్భంగా విజయ్ ఈ విషయం చెప్పాడు.

‘అర్జున్ రెడ్డి’ సినిమా మొదలయ్యే ముందు ఇందులో నటించేందుకు గాను రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విజయ్ తెలిపాడు. ఐతే విడుదల తర్వాత సినిమాకు లాభాలు రావడంతో అందులోంచి తనకు వాటా వచ్చిందని కూడా చెప్పాడు. ఐతే మరీ ఐదు లక్షలకు సినిమా చేయడానికి ఒక హీరో రెడీ అయ్యాడంటే షాకవ్వాల్సిందే. మరి ఈ ఒప్పందం జరిగే సమయానికి ‘పెళ్ళిచూపులు’ సినిమా రిలీజైందో లేదో మరి.

బహుశా ఈ సినిమాలో కంటెంట్ చూసి.. దర్శక నిర్మాత సందీప్ ఆర్థిక పరిస్థితి చూసి విజయ్ అంత తక్కువ మొత్తానికి సినిమా ఒప్పుకున్నాడేమో. పారితోషకం గురించి పట్టించుకోకుండా నిజాయితీగా ఒక సినిమా చేసి.. కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది రుజువు. అలాగని అన్నిసార్లూ ఇలాంటి మ్యాజిక్ జరుగుతుందని చెప్పలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు