ఆ నిర్మాత భలే అమ్మేస్తున్నాడే..

ఆ నిర్మాత భలే అమ్మేస్తున్నాడే..

ఈ రోజుల్లో సినిమా తీయడం ఒకెత్తయితే.. దాన్ని అమ్ముకోవడం.. సరిగ్గా రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో పెద్ద నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతుంటారు కొన్నిసార్లు. సినిమా సెట్స్ మీద ఉండగానే క్రేజ్ తీసుకురావడం.. లాభాలకు అమ్మడం ఒక కళ. ఇందులో కొందరు నిర్మాతలు ఆరితేరిపోయి ఉంటారు. నైజాం డిస్ట్రిబ్యూషన్లలో దిల్ రాజుకు గట్టి పోటీ ఇచ్చి.. ఆ తర్వాత నిర్మాణంలోకి అడుగుపెట్టిన అభిషేక్ నామా ఈ జాబితాలోకే చేరుతున్నాడు.

నిర్మాతగా ఒకేసారి నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టిన అభిషేక్.. ఒకదాని తర్వాత ఒకటి విడదుల చేస్తున్నాడు. ప్రతి సినిమాకూ మంచి బిజినెస్ చేసుకోవడంలో అభిషేక్ టాలెంట్ కనిపిస్తోంది. పోయినేడాది ఆయన బేనర్ నుంచి ‘కేశవ’.. ‘బాబు బాగా బిజీ’ సినిమాలు వచ్చాయి. ఈ రెంటికీ రిలీజ్ ముంగిట మంచి బజ్ వచ్చింది. బిజినెస్ కూడా బాగా జరిగింది. ఇవి రెండూ అంచనాలకు తగ్గట్లు ఆడకపోయినా.. అభిషేక్ మాత్రం బాగా లాభాలు అందుకున్నాడు. ఓపెనింగ్స్ బాగానే రావడంతో బయ్యర్లు కూడా పెద్దగా నష్టపోలేదు.

ఇప్పుడు అభిషేక్ నుంచి రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అవే.. సాక్ష్యం, గూఢచారి. ఇవి వారం వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ఈ రెంటికీ మంచి బిజినెస్ చేసుకున్నాడు అభిషేక్. ‘సాక్ష్యం’ హక్కుల్ని మంచి రేట్లకే అమ్మాడట అభిషేక్. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్ర నైజాం హక్కుల్ని తీసుకోవడం విశేషం. సినిమాకు బడ్జెట్ ఎక్కువే అయినప్పటికీ అందులో హీరో శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ హ్యాండ్ కూడా ఉందని.. అభిషేక్ తన పెట్టుబడి మీద లాభానికే సినిమాను అమ్ముకున్నాడని అంటున్నారు.

మరోవైపు ‘గూఢచారి’ హక్కుల్ని  హోల్ సేల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అమ్మేశాడు అభిషేక్. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర రైట్స్ తీసుకున్నాడు. స్వయంగా డిస్ట్రిబ్యూటర్ అయినప్పటికీ.. అభిషేక్ తన సినిమాల్ని సొంతంగా రిలీజ్ చేయట్లేదు. రిలీజ్ ముందే మంచి రేటు వస్తుండటంతో లాభాలకు అమ్మేసి ఫ్రీ అయిపోతున్నాడు. మొత్తానికి ఆయనకు నిర్మాతగా భలే కలిసొస్తున్నట్లుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు