ఎన్ని బయోపిక్‌లు బాబోయ్..

ఎన్ని బయోపిక్‌లు బాబోయ్..

ఒక కొత్త జానర్లో సినిమా ఆడిందంటే చాలు.. ఇక ఆ కోవలో సినిమాలు వరుస కట్టేస్తాయి. ఇప్పుడు బయోపిక్‌ల పట్ల కూడా అలాంటి మోజే కనిపిస్తోంది. బాలీవుడ్లో కొన్నేళ్లుగా స్పోర్ట్స్ బయోపిక్స్ బాగా నడుస్తున్నాయి. మిల్కా సింగ్, మహేంద్ర సింగ్ ధోని లాంటి వాళ్ల బయోపిక్స్‌కు అద్భుతమైన ఆదరణ కనిపించింది. దీంతో కాస్త పేరున్న ప్రతి ప్లేయర్ మీదా సినిమా తీసేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఓవైపు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ మీద సినిమాకు రెండేళ్ల కిందట్నుంచే సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంకో వైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కథతో సినిమాకు ఏర్పాట్లు జరిగాయి. పి.వి.సింధు కథనూ సినిమాగా తీయడానికి చర్చలు నడుస్తున్నాయి. సానియా మీర్జా సైతం తనపై సినిమా రావాలని ఆశిస్తోంది. ఆమెతోనూ ఒక సంస్థ చర్చిస్తోంది.

తాజాగా మిథాలీ రాజ్ సైతం తనపై సినిమా రాబోతున్నట్లుగా ప్రకటించింది. వయాకామ్ 18 సంస్థ ఆమెతో సినిమా చేస్తుందట. ఇక ఇటీవలే ఎఫ్-1 డ్రైవర్ కార్తికేయన్ కథతో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది. ఇప్పుడు ‘రాజు గాడు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన సంజనా రెడ్డి.. ఒలింపిక్ కాంస్యం గెలిచిన వెయిట్ లిఫ్టర్ మల్లీశ్వరి కథను సినిమాగా చేయడానికి ప్రయత్నిస్తోందట. ఐతే వీళ్లందరిపైనా సినిమాలు తీసేస్తే జనాలు చూసేస్తారా అన్నది డౌట్. సినిమా తీయాలంటే ఆ కథలో అనేక మలుపులు.. డ్రామా ఉండాలి. వాటిని మంచి దర్శకులు తెరకెక్కించాలి. ‘బాగ్ మిల్కా బాగ్’.. ‘ఎం.ఎస్.ధోని’ సినిమాల విషయంలో ఇలా అన్నీ కలిసొచ్చాయి. ఆ కథల మీద జనాల్లోనూ ఆసక్తి ఉంది. స్పోర్ట్స్ బయోపిక్స్ రెండు మూడు ఆడాయి కదా అని అందరి మీదా సినిమాలు తీసుకుంటూ పోతే ఏం ఆసక్తి ఉంటుంది? మధ్యలో మేరీకోమ్ మీద సినిమా తీస్తే అది జనాలకు రుచించని సంగతి గుర్తుంచుకోవాలి. అలాగే సచిన్ మీద డాక్యుమెంటరీ తీస్తే అదీ తుస్సుమనిపించింది. కాబట్టి ఈ బయోపిక్స్ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు