సోమవారం పరీక్ష కూడా పాసైపోయింది

సోమవారం పరీక్ష కూడా పాసైపోయింది

‘ఆర్ఎక్స్ 100’ ప్రభంజనం ఆగట్లేదు. వీకెండ్ తర్వాతైనా సినిమా జోరు తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ ఈ చిత్రం సోమవారం పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఐదో రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.95 లక్షల షేర్ రావడం విశేషం. ఒక చిన్న సినిమాకు సోమవారం ఇంత షేర్ రావడమంటే మాటలు కాదు. రెండో రోజైన శుక్రవారం ఈ చిత్రానికి వచ్చిన షేర్ రూ.1.25 కోట్లు. సోమవారం షేర్ దానికి దగ్గరగా ఉండటం విశేషమే. సోమవారం కూడా ఈ చిత్రానికి అక్కడక్కడా ఫుల్స్ కనిపించాయి. మొత్తంగా సగటున 70 శాతం ఆక్యుపెన్సీతో నడిచిందీ చిత్రం. థియేటర్లు పెరగడం వల్ల కొన్ని ఏరియాల్లో రెండో రోజు కంటే ఐదో రోజు ఎక్కువ షేర్ రావడం విశేషం.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఫుల్ షేర్ దాదాపు రూ.6.5 కోట్లకు చేరుకుంది. ఫుల్ రన్లో ఇది రూ.10 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. కోటిన్నర రూపాయల స్వల్ప బడ్జెట్లో తెరకెక్కి.. రూ.2.5 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు అనూహ్యం. బయ్యర్ల పెట్టుబడిపై నాలుగు రెట్లు ఆదాయం అంటే మాటలు కాదు. ఐతే అమెరికాలో మాత్రం ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అక్కడ వందకు పైగా లొకేషన్లలో పెద్ద ఎత్తునే సినిమాను రిలీజ్ చేశారు కానీ.. అనుకున్న స్పందన లేదు. కలెక్షన్లు నామమాత్రంగా ఉన్నాయి. అక్కడ సినిమా పెద్దగా లాభాలు అందించేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాను కొన్న వాళ్లకు పండగే. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. కార్తికేయ తండ్రి అశోక్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు