మారుతి అయినా కాపాడతాడా?

మారుతి అయినా కాపాడతాడా?

బుల్లితెరపై నటుడిగా.. దర్శకుడిగా.. ప్రొడ్యూసర్‌గా మంచి పేరే సంపాదించాడు ప్రభాకర్. వెండి తెరపైనా అప్పుడప్పడూ కొన్ని పాత్రలు చేశాడు. అతను సినీ దర్శకుడిగా కూడా వెలిగిపోవాలని చూశాడు. అతడికి తొలి అవకాశం పెద్ద నిర్మాతలే ఇచ్చారు. అల్లు అరవింద్, జ్నానవేల్ రాజా లాంటి ప్రముఖ నిర్మాతలు కలిసి అతడి తొలి సినిమా ‘నెక్స్ట్ నువ్వే’ను నిర్మించారు. ఐతే ఓ తమిళ హిట్ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. పెద్ద ఫ్లాప్‌తో ప్రభాకర్ దర్శకత్వ ప్రయాణం మొదలైంది. అతడికి ఇంకో అవకాశం దక్కడం కష్టమే అనుకున్నారు. కానీ మళ్లీ ఇంకో మంచి అవకాశం దక్కించుకున్నాడు. దర్శకుడు మారుతి కథతో అతడి సమర్పణలో తెరకెక్కుతున్న ‘బ్రాండ్ బాబు’కు ప్రభాకరే దర్శకుడు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ జనాలకు బాగానే కనెక్టయింది. మధ్యలో రచయితగా.. నిర్మాతగా చెత్త సినిమాలు అందించిన మారుతి.. ఈసారి మళ్లీ తనదైన శైలిలో మంచి వినోదాత్మక సినిమానే అందించినట్లున్నాడు. ఐతే ఇప్పటిదాకా ఇది మారుతి బ్రాండ్ మూవీగానే ప్రచారంలో ఉంది. ప్రభాకర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ముందు అసలు చాలామంది ప్రభాకర్ అంటే ఎవరో వేరే దర్శకుడేమో అనుకున్నారు. కానీ ఈ ప్రభాకరే ఆ ప్రభాకర్ అన్న సంగతి లేటుగా వెల్లడైంది. తొలి సినిమా మాదిరి తనను తాను ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రభాకర్ ఇష్టపడట్లేదు. మారుతి నీడలోనే సినిమాను పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. సినిమా సక్సెస్ అయ్యాక చూద్దాం అనుకుంటున్నాడేమో. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి ప్రభాకర్ ఈసారైనా సక్సెస్ అందుకుంటాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు