హృతిక్-కంగనా.. బాక్సాఫీస్ ఫైట్?

హృతిక్-కంగనా.. బాక్సాఫీస్ ఫైట్?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాప్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘క్రిష్-3’ టైంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి కొంత కాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా ఊహాగానాలున్నాయి. హృతిక్ తనతో డీప్ లవ్‌లో ఉన్నట్లుగా కంగనా ఆరోపిస్తే.. అలాంటిదేమీ లేదని అంటాడు హృతిక్. వీరి మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరి ఒక దశలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది.

ఒక దశలో మరీ శ్రుతి మించి ఆరోపణలు చేసిన కంగనా.. ఈ మధ్య కొంచెం డౌన్ అయింది. సంయమనం పాటిస్తోంది. ఐతే ఇలాంటి ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు నడిస్తే ఎలా ఉంటుంది? దీనిపై బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి వీళ్లిద్దరూ బాక్సాఫీస్ ఫైట్ పక్కా అంటున్నారు. హృతిక్ ప్రస్తుతం సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కథతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హృతిక్ పూర్తిగా అవతారం మార్చుకున్నాడు. హృతిక్ కెరీర్లో ఇదో మైలురాయి అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని 2019 జనవరి 26న విడుదల చేయాడనికి చాలా ముందే నిర్ణయం అయిపోయింది. దానికి పోటీగా కంగనా సినిమా ‘మణికర్ణిక’ వస్తుందన్న ప్రచారం నడుస్తోంది.

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. కొన్ని కీలక ఎపిసోడ్లు రీషూట్ కూడా చేయబోతున్నారట. ఈ ఏడాది చివరికి పనంతా పూర్తవుతుందని అంటున్నారు. దీన్ని వచ్చే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేద్దామని భావిస్తున్నారట. కంగనా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరి నిజంగా హృతిక్-కంగనా బాక్సాఫీస్ ఫైట్‌కు దిగితే ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు