చైతూ-సామ్.. మధ్యలో ఓ అమ్మాయి

చైతూ-సామ్.. మధ్యలో ఓ అమ్మాయి

అక్కినేని నాగచైతన్య-సమంతల కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘ఏం మాయ చేసావె’.. చివరి సినిమా ‘మనం’ క్లాసిక్స్ లాగా నిలిచిపోయాయి. మళ్లీ వీళ్ల కలయికలో వచ్చే సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ భార్యాభర్తలు కూడా కావడంతో ఈ కాంబినేషన్లో సినిమా మీద మరింత ఆసక్తి ఉంది.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తామిద్దరం భార్యాభర్తలుగా నటించబోతున్నట్లు చైతూ ఇంతకుముందే వెల్లడించాడు నాగచైతన్య. పెళ్లి తర్వాత నడిచే ప్రేమకథ ఇదని అతను చెప్పాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విశేషం బయటికి వచ్చింది.

చై-సామ్ సినిమాలో మరో లేడీ క్యారెక్టర్ కూడా ఉంటుందట. ఆమె చైతన్య జీవితంలోకి రావడంతో అతడికి, సమంతకు విభేదాలు తలెత్తుతాయట. వీళ్ల వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుందట. మరి వాళ్లిద్దరూ సమస్యల్ని ఎలా పరిష్కరించుకుని మళ్లీ ఎలా ఒక్కటయ్యారనేది ఈ కథ అంటున్నాయి చిత్ర సన్నిహిత వర్గాలు. ‘నిన్ను కోరి’లో కూడా పెళ్లి తర్వాత ప్రేమ గురించి చాలా పరిణతితో చర్చించాడు శివ.

మరోసారి అతను అదే స్టయిల్లో వైవాహిక జీవితంలోని గొప్పదనాన్ని చైతూ-సమంతల ద్వారా చెప్పబోతున్నట్లు సమాచారం. చైతూ, సమంత ఆల్రెడీ భార్యాభర్తలు కాబట్టి వీళ్లిద్దరి జోడీ.. వాళ్ల కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. ఇంకో రెండు నెలల్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English