సరైనోడి వెనుకే డీజే కూడా..

సరైనోడి వెనుకే డీజే కూడా..

గత ఐదారేళ్లలో అల్లు అర్జున్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఒకప్పుడు 30-40 కోట్ల మధ్య ఉన్న అతడి మార్కెట్.. గత కొన్నేళ్లలో అమాంతం పెరిగి వంద కోట్లు దాటిపోయింది. తెలుగులోనే కాక.. వేరే భాషాల్లో.. వేరే రాష్ట్రాల్లో కూడా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడతను. మలయాళంలో అతను స్టార్ హీరో అయిపోయాడు.

తర్వాత ఉత్తరాదిన కూడా బన్నీకి తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. అక్కడ అతడి డబ్బింగ్ సినిమాలు ఇరగాడేస్తున్నాయి. థియేట్రికల్ రన్ లేకపోయినా.. యూట్యూబ్‌లో, హిందీ టీవీ ఛానెళ్లలో బన్నీ సినిమాలకు అనూహ్యమైన ఆదరణ ఉంటోంది. బన్నీ సినిమాకు పది కోట్లకు పైగా పెట్టి డబ్బింగ్ హక్కులు తీసుకునే స్థాయి వచ్చేసింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమా హిందీ వెర్షన్‌ను గత ఏడాది యూట్యూబ్‌ల్ రిలీజ్ చేస్తే.. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏడాదికల్లా 20 కోట్ల వ్యూస్ సాధించిందీ చిత్రం. ఇండియాలో సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్ సినిమాలకు కూడా ఇలాంటి రికార్డు లేదు. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమా ఇదే ఇప్పుడు. ఐతే ‘సరైనోడు’ అనుకోకుండా ఇలా రికార్డు కొట్టిందనుకోవడానికి కూడా లేదు.

బన్నీ తర్వాతి సినిమా ‘దువ్వాడ జగన్నాథం’కు కూడా ఇదే ఊపు కనిపిస్తోంది. ఇది కూడా త్వరలోనే 200 మిలియన్ మార్కును అందుకోబోతోంది. దానికి ప్రస్తుతం 17 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. నెలా రెండు నెలల్లో అది కూడా 20 కోట్ల మైలురాయిని దాటే అవకాశముంది. ఇలా వరుసగా రెండు సినిమాలకు ఇన్ని వ్యూస్ రావడం.. తన రికార్డును మళ్లీ బన్నీనే అందుకోబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి బన్నీ లేటెస్ట్ మూవీ ‘నా పేరు సూర్య’కు కూడా యూట్యూబ్‌లో ఇలాంటి ఆదరణే ఉంటుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు