500 కోట్ల క్లబ్బులో ఆ సినిమా

 500 కోట్ల క్లబ్బులో ఆ సినిమా

సంజయ్ దత్ వాస్తవ గాథను మార్చి చూపించారని..  అతడిని ఉత్తముడిలా చూపించడానికే సినిమా తీశారని ‘సంజు’ మీద ఎన్ని విమర్శలైనా రానీ.. ఆ సినిమా వసూళ్ల ప్రభంజనం మాత్రం ఆగట్లేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ధ్రువీకరించాడు. ఇండియాలో మాత్రమే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును దాటేసింది.

ప్రపంచవ్యాప్తంగా మిగతా అన్ని దేశాల్లో కలిపి వసూళ్లు రూ.200 కోట్ల దాకా ఉన్నాయి. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం మూడో వారాంతం పూర్తయ్యేసరికే 500 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ఈ చిత్రం విడుదలైన తొలి వారంలోనే ఇండియాలో రూ.200 కోట్ల మార్కును దాటేసింది. రెండు, మూడు వారాంతాల్లోనూ జోరు చూపిస్తూ వసూళ్ల వర్షాన్ని కొనసాగించింది. గత రెండు వీకెండ్లలో బాలీవుడ్లో మరో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడంతో ‘సంజు’ జోరుకు అడ్డు లేకపోయింది.

రాజ్ కుమార్ హిరాని ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలూ భారీ వసూళ్లు అందుకున్నాయి. ‘3 ఇడియట్స్’, ‘పీకే’ చిత్రాలు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించాయి. ఐతే ఆ సినిమాల్లో అమీర్ ఖాన్ ఉన్న సంగతి మరువరాదు. అతడి బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలిసిందే. ఐతే ఈసారి రణబీర్ కపూర్ లాంటి మీడియం రేంజ్ హీరోను పెట్టుకుని కూడా హిరాని బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. తన మిత్రుడైన సంజయ్ దత్‌‌ కోసం హిరాని చాలా రాజీ పడ్డాడని చెడ్డ పేరు వచ్చినప్పటికీ.. దర్శకుడిగా అతడి స్థాయేంటో ‘సంజు’ మరోసారి రుజువు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English