ఆ సినిమా వసూళ్లు ఇంకా పెరిగాయ్

ఆ సినిమా వసూళ్లు ఇంకా పెరిగాయ్

టాలీవుడ్లో ఇప్పుడో చిన్న సినిమా హాట్ టాపిక్ అవుతోంది. కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన ఆ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చూసి అందరూ షాకైపోతున్నారు. ఆ చిత్రమే.. ఆర్ఎక్స్ 100. ఆసక్తికర ప్రోమోలతో జనాల్లో క్యూరియాసిటీ పెంచిన ఈ చిన్న సినిమా.. తొలి రోజే రూ.1.5 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. శుక్రవారం కార్తి సినిమా ‘చినబాబు’ విడుదలైనప్పటికీ.. దాని పోటీని కూడా తట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల పైచిలుకు షేర్ రాబట్టింది ‘ఆర్ఎక్స్ 100’. విశేషం ఏంటంటే.. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు వసూళ్లు పెరిగాయి. ఈ చిత్రం శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి 1.25 కోట్ల షేర్  రాబట్టింది.

దీంతో మొత్తం ఈ చిత్ర డొమెస్టిక్ షేర్ 3.75 కోట్లకు చేరుకుంది. ఆదివారం కూడా ఇదే ఊపు కొనసాగే అవకాశముంది. ఈజీగా షేర్ ఐదు కోట్ల మార్కును దాటేసే అవకాశముంది. ఈ చిత్రాన్ని కోటిన్నర రూపాయల బడ్జెట్లో తెరకెక్కించి.. కోటి రూపాయల లాభానికి అమ్మారు. ఆ మొత్తం రెండు రోజులకే వసూలైపోయింది. వీకెండ్ అయ్యేసరికే బయ్యర్లు పెట్టుబడి మీద రెట్టింపు మొత్తం అందుకుంటున్నారు. ఈ ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో ఈ చిత్రం పది కోట్ల షేర్ మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

యూత్‌కు బాగా కనెక్టయ్యే రొమాంటిక్ ట్రాక్.. ట్విస్టులు.. యాక్షన్.. పాటలు ఉండటంతో ‘ఆర్ఎక్స్ 100’ పైసా వసూల్ అనిపిస్తోంది. రివ్యూలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ వసూళ్లపై ఆ ప్రభావం ఎంతమాత్రం కనిపించడం లేదు. ఇటు మల్టీప్లెక్సుల్లో, అటు సింగిల్ స్క్రీన్లలో ఫుల్స్‌తో నడుస్తోందీ సినిమా. మరి సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు