పవన్ నిర్మాత రేంజ్ ఎంత పడిపోయిందో..

పవన్ నిర్మాత రేంజ్ ఎంత పడిపోయిందో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో వరుసగా మూడు సినిమాలు నిర్మించడమంటే మాటలు కాదు. ఇప్పటిదాకా కెరీర్లో ఏ నిర్మాతకూ ఆ అవకాశం దక్కలేదు. ఒక నిర్మాతతో పవన్ రెండో సినిమా చేసిన సందర్భాలు కూడా అరుదే. కానీ తన మిత్రుడైన శరత్ మరార్‌తో వరుసగా మూడు చిత్రాలు చేశాడు పవన్.

‘గోపాల గోపాల’తో మొదలు పెట్టి.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’.. ఇలా వరుసగా పవన్ నటించిన మూడు సినిమాలూ మరారే నిర్మించాడు. కానీ ఈ మూడు సినిమాలూ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినప్పటికీ మరార్ మాత్రం పవన్ క్రేజును బాగానే సొమ్ము చేసుకున్నాడని అంటారు. ఐతే ‘కాటమరాయుడు’ తర్వాత పవన్‌కు, అతడికి ఏదో తేడా వచ్చి ఇద్దరూ దూరమైపోయారు. ఆ తర్వాత పవన్ క్యాంపులో ఎక్కడా మరార్ కనిపించడం లేదు.

పవన్‌కు దూరమయ్యాక మరార్ సినిమాలకు దూరమైపోలేదు. ఆయన బేనర్ నుంచి రెండు డబ్బింగ్ సినిమాలు రావడం విశేషం. అవే.. అదిరింది, కర్తవ్యం. ఈ రెండూ బాగానే ఆడాయి. కానీ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసిన నిర్మాత డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయడమేంటి అన్నారంతా. ఐతే ఇప్పుడు మరార్ మరింతగా తన రేంజ్ తగ్గించుకున్నాడు. అసలేమాత్రం పేరు లేని కొత్త నటీనటులు.. దర్శక నిర్మాతలు కలిసి చేస్తున్న ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాకు మరార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ టైటిల్.. దీని యవ్వారం చూస్తుంటే మరీ చిన్న స్థాయి సినిమాలా అనిపిస్తోంది. ఆకెళ్ల పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఇలాంటి సినిమాతో మరార్ తన ప్రత్యేకతను ఏం చాటుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు