దిల్ రాజు ‘భారతీయుడు-2’ చేస్తున్నాడని..

దిల్ రాజు ‘భారతీయుడు-2’ చేస్తున్నాడని..

కెరీర్లో చాలా వరకు మీడియం రేంజి బడ్జెట్లలోనే సినిమాలు చేశాడు దిల్ రాజు. మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి బడా స్టార్లతో సినిమాలు చేసినా బడ్జెట్లు మాత్రం అదుపులోనే పెట్టుకున్నాడు. అలాంటి నిర్మాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూ.200 కోట్ల బడ్జెట్లో ‘భారతీయుడు-2’ చేయడానికి కొన్ని నెలల కిందట సన్నాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి రాజు తప్పుకున్నాడు. మరో నిర్మాతతో శంకర్ ‘భారతీయుడు-2’ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐతే బడ్జెట్ సమస్యల వల్లే రాజు ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజు ప్రొడక్షన్లో రాబోతున్న కొత్త సినిమా ‘లవర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వేదికపై ‘భారతీయుడు-2’ ప్రస్తావన రావడం విశేషం.

‘లవర్’ సినిమాతోనే పూర్తి స్థాయి నిర్మాతగా పరిచయం కానున్న రాజు అన్న కొడుకు హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారతీయుడు-2’ ప్రస్తావన తెచ్చాడు. బాలీవుడ్లో ‘ఆషిఖి-2’ లాంటి ఆల్ టైం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగీత దర్శకుడు అంకిత్ తివారీ ‘లవర్’ సినిమాలో రెండు పాటలు కంపోజ్ చేశాడు. ఐతే ముందు ఈ సినిమా కోసం అంకిత్‌ను అడిగితే తటపటాయించాడట. ఐతే ఇది దిల్ రాజు సినిమా అని తెలిసి ఒప్పుకున్నాడట. రాజు ఇంతకముందు శంకర్-ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో ‘భారతీయుడు-2’ తీయబోతున్నాడని తెలుసుకున్న అంకిత్.. తాను ఎంతగానో ఆరాధించే రెహమాన్‌తో సినిమా చేస్తున్నాడంటే ఆ నిర్మాత మామూలోడు కాదనుకుని ‘లవర్’ సినిమా ఒప్పుకున్నట్లుగా చెప్పాడని హర్షిత్ వెల్లడించాడు. ఐతే హర్షిత్ ఈ సంగతి చెబుతున్నపుడు దిల్ రాజు గట్టిగా నవ్వేస్తూ.. తాను ఆ సినిమా చేయట్లేదని అంకిత్‌కు చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు