సైరా.. 30 శాతమే అయిందా?

సైరా.. 30 శాతమే అయిందా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’. నిజానికి ఈ చిత్రం చాలా ఏళ్ల కిందటే మొదలు కావాల్సింది. చిరు రీఎంట్రీ మూవీగా దీన్నే చేయాలని కూడా అనుకున్నాడు. కానీ ఇంత భారీ చిత్రంతో సాహసం చేయలేక సేఫ్‌గా రీమేక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ని ఎంచుకున్నాడు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాక ఇప్పుడు ధైర్యంగా ‘సైరా’ చేస్తున్నాడు. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. ఏళ్ల కొద్దీ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఎట్టకేలకు గత ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. చిరు మరే పనులూ పెట్టుకోకుండా ఈ సినిమా చిత్రీకరణ మీదే పూర్తిగా దృష్టిపెట్టాడు. ఇప్పటికే మూణ్నాలుగు షెడ్యూళ్లు అయ్యాయి. ఒక షెడ్యూల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నాడు. కొన్ని రోజుల కిందటే ఒక భారీ షెడ్యూల్ కూడా మొదలుపెట్టారు. అది పూర్తి కావస్తోంది.

ఐతే ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ గురించి తెలుసుకుంటున్న అభిమానులు.. చిత్రీకరణం 60-70 శాతమైనా అయిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ చిత్ర బృందం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటిదాకా 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందట. చిరు కెరీర్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో చిత్ర బృందం ఏమాత్రం రాజీ పడట్లేదట. ‘బాహుబలి’ తరహాలో దీన్ని ఒక మైల్ ‌స్టోన్ మూవీలా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో నెమ్మదిగా.. అత్యంత శ్రద్ధతో చిత్రీకరణ సాగిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న స్పీడులోనే చిత్రీకరణ కొనసాగితే ఇటీవల అన్నట్లుగా వచ్చే ఏడాది వేసవికి కూడా సినిమా రెడీ కావడం కష్టమే. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ ఏడాది చివరికి చిత్రీకరణ పూర్తి చేసి.. ఆ తర్వాత రెండు మూడు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరిపి మార్చి లేదా ఏప్రిల్లో సినిమాను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆ డెడ్ లైన్ అందుకోవడం కష్టమే అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్దానికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు