క్రిష్.. ఆ సినిమాను వదిలేశాడా?

క్రిష్.. ఆ సినిమాను వదిలేశాడా?

దక్షిణాదిన మంచి పేరు సంపాదించాక బాలీవుడ్‌కు వెళ్లి వెలిగిపోవాలని హీరోయిన్లే కాదు.. దర్శకులు కూడా కలలు కంటుంటారు. రామ్ గోపాల్ వర్మ, మురుగదాస్, పూరి జగన్నాథ్.. ఇలా చాలామంది దర్శకులు బాలీవుడ్లో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన వాళ్లే. ఈ కోవలోనే క్రిష్ సైతం అక్కడ తన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ అతను ‘గబ్బర్’ అనే సినిమా తీశాడు. ‘ఠాగూర్’ రీమేక్ అయిన ఆ చిత్రం అంతగా ఆడలేదు. అయినా నిరాశ చెందకుండా వీర నారి ఝాన్సీ లక్ష్మీభాయి కథతో ‘మణికర్ణిక’ అనే సినిమాను గత ఏడాది మొదలుపెట్టాడు. రెండు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని టేకప్ చేశాయి. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనికి స్క్రిప్టు అందించారు. కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో లీడ్ రోల్ చేసింది.

ఐతే ఈ సినిమా విషయంలో ఏదీ సజావుగా సాగలేదు. చిత్రీకరణ సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అనుకున్న సమయానికి షూటింగ్ అవ్వలేదు. రిలీజ్ డేట్ అందుకోలేకపోయారు. మధ్యలో కొన్ని కీలక సన్నివేశాల విషయంలో సంతృప్తి చెందక రీషూట్లకు కూడా వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అవన్నీ అయ్యాక కూడా సినిమా విడుదల సంగతేంటో తేలట్లేదు. ఆగస్టు మధ్యలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని అన్నారు కానీ.. క్రిష్ పోస్ట్ ప్రొడక్షన్ సంగతి వదిలేసి.. హైదరాబాద్‌లో తేలడం, ఎన్టీఆర్ బయోపిక్‌లో మునిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మామూలుగా బాలీవుడ్‌లో ఏ దర్శకుడినీ సినిమా రిలీజ్ అయ్యేవరకు విడిచిపెట్టరు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వ్యవహారాల్లో కూడా పాలు పంచుకునేలా అగ్రిమెంట్లు జరుగుతాయి. కానీ క్రిష్ విషయంలో ఏం జరిగిందో ఏమో కానీ.. అతను సినిమాను నిర్మాతలకే విడిచిపెట్టి వచ్చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ కంగనాతో, నిర్మాతలతో అతడికి అభిప్రాయ భేదాలున్నట్లు చెబుతున్నారు. తెర వెనుక అసలేం జరిగిందో ఏమో కానీ.. ‘మణికర్ణిక’ రిలీజ్ గురించి మాత్రం ఏ వార్తలూ రావట్లేదు. ఆ సినిమా గురించి అసలు అప్ డేట్లే లేవు. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English