నాగ్ నుంచి చైతూ అందుకున్నట్లే..

నాగ్ నుంచి చైతూ అందుకున్నట్లే..

అక్కినేని నాగేశ్వరరావు మొదలుపెట్టిన బేనర్ ‘అన్నపూర్ణ స్టూడియోస్’. ఆయన సినిమాలు మానేసి ఇంటికి పరిమితం అయ్యాక ఆయన తనయులు వెంకట్, నాగార్జున కలిసి ఆ బేనర్‌ను నడిపించారు. ఒక దశ దాటాక పూర్తిగా నాగార్జునే ఈ బేనర్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ బేనర్ నుంచి వచ్చే సినిమాలన్నింట్లో నిర్మాతగా ఆయన పేరే కనిపించేది. ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ నాగార్జునే చూసుకునేవాడు. ఐతే నాగార్జునకూ ఇప్పుడు వయసు మీద పడింది. ఇక ఆయన వారసులు బేనర్ బాధ్యతలు చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ బాధ్యతను నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య తీసుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లూ తన బేనర్లో తాను నటించినా.. వేరే వాళ్లతో సినిమా తీసినా చైతూ జోక్యం చేసుకునేవాడు కాదు. నటనకే పరిమితం అవుతూ ప్రొడక్షన్, ఇతర వ్యవహారాలకు దూరంగా ఉండేవాడు.

కానీ ఇప్పుడు చైతూ ఆలోచన మారినట్లుంది. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ వ్యవహారాలు చేపట్టడానికి రెడీ అయినట్లున్నాడు. ఈ బేనర్ నుంచి రాబోయే కొత్త సినిమా ‘చి ల సౌ’కి సంబంధించి మొత్తం పని చైతూనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించింది వేరే సంస్థ అయినా.. ఈ కథేంటో తెలుసుకుని దీన్ని తమ సంస్థ ద్వారా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసింది చైతూనే. అతను, సమంత కలిసి ఆ సినిమా చూసి.. తామే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. వెంటనే ప్రకటన వచ్చేసింది. విశేషం ఏంటంటే.. చైతూ, సమంత కలిసి ఈ చిత్రాన్ని ఉద్ధృతంగా ప్రమోట్ చేస్తున్నారు కూడా. చైతూ, సమంతల ట్విట్టర్ అకౌంట్లు చూస్తే ఈ సినిమా ముచ్చట్లే కనిపిస్తాయి. రెండో టీజర్, సాంగ్ వీళ్లే లాంచ్ చేశారు. ఈ సినిమా గురించి ట్వీట్లు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా ఎక్కడా నాగ్ ఈ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మున్ముందు ‘సురేష్ ప్రొడక్షన్స్’ తరహాలోనే ‘అన్నపూర్ణ’ ద్వారా కూడా చిన్న సినిమాలకు సపోర్ట్ ఇచ్చి తమ బేనర్లో రిలీజ్ చేయడం.. వర్ధమాన దర్శకులతో తక్కువ బడ్జెట్లో సినిమాలు చేయడం.. ఇలాంటి ప్రణాళికలతో ఉన్నారు చై-సామ్. ఆ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కూడా ధ్రువీకరించాడు చైతూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు