రజనీ సినిమాలో ఇన్ని అట్రాక్షన్లా?

రజనీ సినిమాలో ఇన్ని అట్రాక్షన్లా?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే.. ఆయనొక్కడి పాత్ర హైలైట్ అయితే చాలన్నట్లుగా ఉంటుంది అభిమానుల తీరు. మిగతా నటీనటుల గురించి.. వేరే ఆకర్షణల గురించి పెద్దగా పట్టించుకోరు. చాలామంది దర్శకులు కూడా రజనీ చుట్టూనే కథను తిప్పుతుంటారు. మిగతా పాత్రల్ని తేల్చేస్తుంటారు. కానీ అలా ట్రై చేసే చాలామంది బోల్తా కొట్టారు. ఈ క్రమంలో కథ.. మిగతా పాత్రలు తేలిపోతుంటాయి. సినిమాలో మిగతా పాత్రలూ బలంగా ఉంటేనే రజనీ పాత్ర అయినా హైలైట్ అవుతుందనే విషయాన్ని మరిచిపోతుంటారు. ఐతే రజనీ కొత్త సినిమా విషయంలో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటున్నట్లున్నాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ‘పిజ్జా’తో దర్శకుడిగా పరిచయం అయిన కార్తీక్.. తన ప్రతి సినిమాలోనూ ప్రతి పాత్రనూ బలంగా తీర్చిదిద్దుతుంటాడు. విలన్‌తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల క్యారెక్టర్లూ ప్రాధాన్యం సంతరించుకుంటాయి అతడి సినిమాల్లో.

రజనీతో అతను రూపొందిస్తున్న కొత్త సినిమా విషయంలోనూ ఇదే శైలిని అనుసరిస్తున్నట్లున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడు ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అతను ఆషామాషీ నటుడు కాదు. విజయ్ ఎంచుకునే పాత్రలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చిత్రంలో సిమ్రాన్.. కాజల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో స్పెషల్ ఆర్టిస్టు ఈ సినిమాలో జాయినయ్యాడు. మలయాళంలో గొప్ప గొప్ప పాత్రలో నటుడిగా మంచి పేరు సంపాదించిన నేషనల్ అవార్డు కూడా అందుకున్న ఫాహద్ ఫాజిల్.. రజనీ-కార్తీక్ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడట. మొత్తానికి ఈ చిత్రంలో అట్రాక్షన్లు చాలానే కనిపిస్తున్నాయి. అతను రెండో షెడ్యూల్ నుంచి షూటింగులో జాయినవుతున్నాడు. నెల రోజుల పాటు డార్జిలింగ్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం.. మధురైలో త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలుపెట్టనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించనున్నాడు.