ఆర్ఎక్స్ 100 సంచలనం

ఆర్ఎక్స్ 100 సంచలనం

రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ‘ఆర్ఎక్స్ 100’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ షాకవుతున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ రూ.2.5 కోట్లకు అమ్మితే.. కేవలం రెండే రోజుల్లో ఆ మొత్తం రికవర్ అయపోవడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రెండో రోజుకే రూ.2.5 కోట్ల షేర్ రాబట్టింది. తొలి రోజు షేర్ రూ.1.5 కోట్లు కాగా.. రెండో రోజు 1.08 కోట్ల షేర్ రావడం విశేషం. నైజాం ఏరియాలో మాత్రమే రూ.50 లక్షల షేర్ రాబట్టిందీ చిత్రం. మూడో రోజు నుంచి వచ్చే వసూళ్లన్నీ బయ్యర్లకు లాభాలే అన్నమాట. ఈ సినిమా ఊపు చూస్తుంటే రూ.7.8 కోట్లకు తక్కువ కాకుండా షేర్ వసూలు చేసేలా కనిపిస్తోంది.

‘ఆర్ఎక్స్ 100’ జోరు ఎలా సాగుతోందో చెప్పడానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కలెక్షన్లే నిదర్శనం. ఇక్కడ దేవి 70 ఎంఎం లాంటి భారీ థియేటర్లో ఈ చిత్రం ఆడుతోంది. ఆ థియేటర్ ఫుల్ అయితే రూ.1.3 లక్షల గ్రాస్ వసూలవుతుంది. హైదరాబాద్‌లోని అతి పెద్ద థియేటర్లలో ఇదొకటి. ఆ థియేటర్లో బడా హీరోల సినిమాలకు తొలి వీకెండ్లో మాత్రమే ఫుల్స్ పడతాయి. అలాంటి థియేటర్లో ‘ఆర్ఎక్స్ 100’ ప్రతి షోకూ దాదాపు ఫుల్ అవుతోంది. గురు, శుక్రవారాల్లో రెండు రోజులూ సెకండ్ షోకు ఈ సినిమా హౌస్ ఫుల్ కావడం విశేషం.