చిరంజీవి జోస్యాలు తిరగబడుతున్నాయే..

చిరంజీవి జోస్యాలు తిరగబడుతున్నాయే..

టాలీవుడ్లో కొందరు ప్రముఖుల్ని జడ్జిమెంట్ కింగ్స్‌గా చెబుతారు. వాళ్లు కథ విని అది వర్కవుటవుతుందో లేదో చెప్పేస్తారని.. అలాగే రషెస్ చూసి కూడా సినిమా ఫలితాన్ని అంచనా వేసేస్తారని అంటారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. మెగాస్టార్ జడ్జిమెంట్ స్కిల్స్ గురించి చాలామంది గొప్పగా చెప్పారు. కొన్ని రోజుల కిందట ‘విజేత’ సినిమా ఆడియో వేడుకలో రాజమౌళి సైతం ఈ విషయాన్నే ప్రస్తావించాడు.

ఒక కథ విని అది వర్కవుటవుతుందో లేదో చెప్పడంలో చిరును మించిన వాళ్లు మన ఇండస్ట్రీలోనే లేరన్నట్లుగా రాజమౌళి చెప్పాడు. కానీ చిరు ఆమోద ముద్ర వేసిన ‘విజేత’ కథే ఇప్పుడు తిరగబడింది. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం ఈ చిత్రం పేలవమైన టాక్ తెచ్చుకుంది.

ముందు నుంచి ఈ సినిమాపై హైప్ లేదు. దీనికి తోడు టాక్ కూడా బ్యాడ్‌గా ఉండటంతో సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. ఓవైపు అనామక హీరో నటించిన ‘ఆర్ఎక్స్ 100’ సంచలన వసూళ్లతో దూసుకెళ్తుంటే చిరు అల్లుడి సినిమా వెలవెలబోతోంది. వీకెండ్లోనే సినిమా తేలిపోయింది. దీంతో చిరు ఇలాంటి కథను ఎలా ఓకే చేశాడో.. ఇది ఎలా హిట్టవుతుందని ధీమాగా ఆడియో వేడుకలో ప్రకటించాడో అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది మాత్రమే కాదు.. దీనికిముందు కూడా చిరు జోస్యాలు కొన్ని తేడా కొట్టాయి.

తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ‘తేజ్ ఐ లవ్యూ’ గురించి కూడా చిరు గొప్పగా చెప్పాడు. రషెస్ చూశానని.. సినిమా పెద్ద హిట్టవుతుందని అన్నాడు. ఆ సినిమా ఏమైందో తెలిసిందే. ఇక గత ఏడాది చివర్లో అఖిల్ సినిమా ‘హలో’ గురించి కూడా చిరు చాలా ఉద్వేగంతో స్పందించాడు. అదో అద్భుతమైన సినిమా అన్నాడు. సూపర్ హిట్ అవుతుందన్నాడు. అది కూడా తేడా కొట్టేసింది. ఒక సినిమా ఫలితాన్ని అంచనా వేయడం అన్నది అన్నిసార్లూ సాధ్యం కాదు. కానీ చిరు జడ్జిమెంట్లు వరుసగా తేడా కొట్టేస్తుండటంతోనే ఆయన ఈ తరం ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English