బుచ్చయ్య ఈపని చేస్తే చంద్రబాబుకు ఇబ్బందేనా ?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, సీనియర్ నేత, ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం పార్టీలో పెద్ద సంచలనంగా మారింది. ఈనెల 25వ తేదీన పార్టీకి తర్వాత ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు స్వయంగా గోరంట్లే ప్రకటించడాన్ని చంద్రబాబునాయుడు ఏ మాత్రం ఊహించలేదు. బుచ్చయ్య రాజీనామా విషయం తెలియగానే బుధవారం రాత్రి చంద్రబాబు ఫోన్ చేసి దాదాపు అర్ధగంట పాటు మాట్లాడారు.

పార్టీ అధినేతతో అంతసేపు మాట్లాడిన తర్వాత గురువారం ఉదయం బుచ్చయ్య తన రాజీనామా నిర్ణయాన్ని మీడియాకు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే పార్టీని వదిలేయాలని, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ చేసుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది. 1983 నుండి 2019 వరకు బుచ్చయ్య రాజకీయ ప్రస్ధానాన్ని చూస్తే పోటీ చేసిన ఎనిమిది ఎన్నికల్లో రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. గెలుపు, ఓటముల కన్నా చూడాల్సిందే పార్టీ పట్ల ఆయన చిత్తశుద్దిని.

ఎంతో సీనియర్ అయిన తనను చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారనే భావన బుచ్చయ్యలో బలంగా ఉంది. 2014లో మంత్రివర్గం కూర్పులోను తర్వాత విస్తరణ సందర్భం తర్వాత బుచ్చయ్య బహిరంగంగానే ఈ విషయాన్ని మీడియాతో చెప్పారు. అప్పటి నుండి చంద్రబాబు వ్యవహారశైలిపై గోరంట్లలో అసంతృప్తి పెరిగిపోతోంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు+లోకేష్ తనతో వ్యవహరిస్తున్న తీరుతో బుచ్చయ్యకు బాగా మండిపోతున్నట్లు సమాచారం. తాను ఫోన్ చేసినా ఇద్దరు తీయటంలేదట.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బుచ్చయ్య ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. కొందరేమో బీజేపీలో చేరబోతున్నారంటున్నారు. మరికొందరేమో వైసీపీలో చేరబోతున్నట్లు చెబుతున్నారు. బీజేపీలో చేరితే పర్వాలేదు కానీ అదే వైసీపీలో చేరితే మాత్రం చంద్రబాబుకు బాగా ఇబ్బందనే చెప్పాలి. బుచ్చయ్య వైసీపీలో చేరే అవకాశాలున్నాయని టీడీపీ మద్దతు మీడియానే చెబుతోంది. వైసీపీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డిని బుచ్చయ్య ఎంతగా వ్యతిరేకించారో చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీలో కానీ బయటగాని వైసీపీ ప్రభుత్వాన్ని మొన్నటి వరకు బుచ్చయ్య తూర్పారబడుతూ ఉన్నారు.

అలాంటి బుచ్చయ్య పోయి పోయి వైసీపీలోనే చేరితే జగన్ పై ఏ రేంజిలో విరుచుకుపడ్డారో అదే రేంజిలో రివర్సులో చంద్రబాబు అండ్ కో మీద విరుచుకుపడతారనటంలో సందేహంలేదు. ముఖ్యంగా 1995 వ్యవహారం మొదలుకుని చంద్రబాబు ప్లస్ లు మైనస్ లు అన్నీ తెలిసిన వ్యక్తి బుచ్చయ్య. ఇపుడా అంశాలన్నింటినీ బుచ్చయ్య గనుక విప్పడం మొదలు పెడితే చంద్రబాబుకు ఎంత ఇబ్బందవుతుందో చెప్పడం కష్టమే. మరి బుచ్చయ్య ఏమి చేస్తారో చూడాల్సిందే.