చరణ్ సంగతి తర్వాత.. ముందు నానితో

చరణ్ సంగతి తర్వాత.. ముందు నానితో

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వరుసగా సూపర్ హిట్లు తీసి నిర్మాతగా గొప్ప పేరు సంపాదించాడు సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు. 90ల వరకు ఆయన హవా బాగానే సాగింది. చిరుతో బ్రేక్ వచ్చాక ‘చంటి’ లాంటి మరో పెద్ద హిట్ కూడా తీశాడాయన. కానీ ఆపై ఆయన బేనర్ నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. వరుస ఫ్లాపులు ఆయన్ని బాగా దెబ్బ తీశాయి. దీంతో ఒక దశలో సినిమాలు మానేసి సైలెంటుగా ఉండిపోయాడు రామారావు.

ఐతే ఈ మధ్య మళ్లీ కొంచెం పుంజుకుని ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాతో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ.. అది ఆ ఆశల్ని నెరవేర్చలేదు. రామారావు ఖాతాలో మరో ఫ్లాప్‌ను జమ చేసింది.

ఐతే ఈ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. రామారావుతో తన కొడుకు రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించిన ఆయనకు ఆనందాన్ని కలిగించాడు. ఏదో మాట వరసకు కాకుండా చాలా సీరియస్‌గానే ఈ విషయాన్ని ప్రకటించాడు చిరు. కానీ చరణ్‌తో రామారావు సినిమా చేయాలంటే ఇంకో రెండేళ్లయినా ఆగాలి. ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత రాజమౌళి మల్టీస్టారర్లోకి వెళ్లిపోతాడు. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం మొదలుపెడితే.. దాన్నుంచి ఫ్రీ అవ్వడానికి ఏడాదిన్నర పడుతుంది.

కాబట్టి అంత కాలం ఖాళీగా ఉండలేడు రామారావు. ఈలోపు ఆయన నాని హీరోగా ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నానితో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఇంద్రగంటి.. అతడితో మూడో సినిమా చేయబోతున్నాడట. ఆ చిత్రాన్ని రామారావే నిర్మిస్తాడట. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలు కావచ్చని అంటున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English