విజయ్ పోస్టర్ వివాదంలో మరో మలుపు

విజయ్ పోస్టర్ వివాదంలో మరో మలుపు

తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు సంబంధించి అతడి ప్రమేయం లేకుండా ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. గత ఏడాది ‘మెర్శల్’ ఎంత పెద్ద వివాదంలో చిక్కుకుందో తెలిసిందే. అంతకుముందు ‘కత్తి’.. ‘తలైవా’ లాంటి సినిమాలకూ వివాదాలు తప్పలేదు. ఐతే ఆ సినిమాలకు రిలీజ్ టైంలో మాత్రమే ఇబ్బందులు తలెత్తాయి. ఐతే అతడి కొత్త సినిమా ‘సర్కార్’ విషయంలో అయితే ఫస్ట్ లుక్ దగ్గర్నుంచే గొడవ మొదలైంది. అందులో విజయ్ సిగరెట్ తాగుతుండటం మీద తమిళనాట వివాదం రాజుకుంది.

ధూమపానాన్ని ప్రోత్సహించేలా ఈ పోస్టర్ ఉందంటూ కేసు పెట్టారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆ పోస్టర్ ఉపసంహరించుకున్నారు. ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేసినందుకు రూ.10 కోట్లు కట్టాలంటూ మరో పిటిషన్ కూడా వేశారు కోర్టులో.

ఐతే విజయ్ సినిమాల్ని కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ కోలీవుడ్లో ఒక వర్గం ఆందోళన మొదలుపెట్టింది. నటుడు.. నిర్మాత టి.రాజేందర్ ఈ విషయంలో గట్టిగానే వాయిస్ వినిపించాడు. ఇది సినిమాలపై.. తమిళులపై దాడే అని ఆయన వాదించారు. విజయ్‌పై రాజకీయ పరమైన కుట్ర జరుగుతోందని ఆయనన్నాడు. ధూమపానం హానికరమైతే మొత్తంగా సిగరెట్లనే ప్రభుత్వం బ్యాన్ చేయొచ్చు కదా.. కేవలం సినిమా పోస్టర్లు.. సన్నివేశాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివాదాలు రాజేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రాజేందర్ ఈ విషయమై ప్రెస్ మీట్ పెట్టి హాట్ కామెంట్స్ చేశాక ఆయన తనయుడు శింబు లైన్లోకి వచ్చాడు.

స్వతహాగా అజిత్ ఫ్యాన్ అని చెప్పుకునే శింబు.. విజయ్‌కి ఈ విషయంలో పూర్తి మద్దతు ఇచ్చాడు. సినిమాల్లో ధూమపాన సన్నివేశాలకు సంబంధించి ఎవరితో అయినా తాను చర్చకు రెడీ అని అతనన్నాడు. సినిమా వాళ్లు సాఫ్ట్ టార్గెట్ అయిపోతున్నారని.. అన్నింటికీ వాళ్లనే బ్లేమ్ చేయడం ఏంటని అతను ప్రశ్నించాడు. కోలీవుడ్ నుంచి మరి కొందరు కూడా ఈ విషయంలో గళం వినిపిస్తున్నారు. చూస్తుంటే ఈ విషయం పెద్ద చర్చనీయాంశమే అయ్యేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు