మామ-అల్లుడు.. కల నెరవేరింది

మామ-అల్లుడు.. కల నెరవేరింది

అక్కినేని.. దగ్గుబాటి అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏఎన్నార్‌తో ‘ప్రేమనగర్’ లాంటి ఎవర్ గ్రీన్ హిట్ తీసిన రామానాయుడు.. ఆ తర్వాత ఆయనకు వియ్యంకుడిగా మారారు. తన కూతురు లక్ష్మిని నాగార్జునకిచ్చి పెళ్లి చేశాడు. కానీ నాగ్-లక్ష్మి ఎంతో కాలం కలిసుండలేదు. ఐతే వీళ్ల కొడుకు నాగచైతన్య మాత్రం రెండు కుటుంబాల ముద్దుల బిడ్డ అయ్యాడు.

రెండు చోట్లా అతడిని ప్రేమగా చూసుకున్నారు. యుక్త వయసు వచ్చే వరకు దగ్గుబాటి కుటుంబంలోనే పెరిగిన చైతూ.. ఆ తర్వాత నాన్న నీడలోకి వచ్చాడు. హీరోగా పరిచయమయ్యాడు. తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. ఐతే తన ముద్దుల మేనల్లుడితో ఓ సినిమా చేయాలని దగ్గుబాటి సోదరులు సురేష్.. వెంకటేష్ ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి.

ఐతే ఎట్టకేలకు దగ్గుబాటి బ్రదర్స్ కల నెరవేరింది. వెంకటేష్, చైతూ హీరోలుగా సురేష్ నిర్మించే సినిమా బుధవారమే మొదలైంది. ఉదయం రామానాయుడు స్టూడియోలోనే ఈ చిత్రానికి ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. ‘జై లవకుశ’ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నట్లు ఇంతకుముందే సురేష్ వెల్లడించాడు. ఇందులో చైతూ సరసన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ భామ రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోంది. వెంకీ హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. బుధవారం కేవలం ప్రారంభోత్సవం మాత్రమే చేశారు. రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి ఇంకా సమయం పడుతుంది.

ప్రస్తుతం చైతూ ‘శైలజా రెడ్డి అల్లుడు’.. ‘సవ్యసాచి’ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి కావస్తున్నాయి. వెంకీ.. వరుణ్ తేజ్‌తో మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఇద్దరూ ఫ్రీ అయ్యాక సెప్టెంబరు లేదా అక్టోబరులో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. సురేష్ బాబు తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English