పవన్ ఫ్యాన్స్ పాయింటు పట్టుకున్నారు

పవన్ ఫ్యాన్స్ పాయింటు పట్టుకున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలోనే ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మరో పెళ్లికి సిద్ధం కావడం.. అదే సందర్భంలో పవన్‌ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. పవన్ మీద తాను ఎప్పటికీ ప్రతికూల వ్యాఖ్యలు చేయను అంటూనే తనతో 11 ఏళ్లు కలిసి ఉన్న వ్యక్తి.. తనకు తెలియకుండానే మరో మహిళతో సంబంధం పెట్టుకుని బిడ్డను కనేశాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

రేణు నుంచి పవన్ అభిమానులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు. ఇప్పటికే రేణు మరో పెళ్లి చేసుకోవడంపై ఆమెను ట్రోల్ చేసిన అభిమానులు.. ఈ వ్యాఖ్యలతో ఆమెపై దాడిని తీవ్రతరం చేశారు. ఆమెను ఎలా పడితే అలా తిట్టేవాళ్లు కొందరైతే.. ఇంకొందరు పాయింట్ పట్టుకుని ఆమెపై అటాక్ చేస్తున్నారు.

రేణుకు పవన్ 2011లోనే అధికారికంగా విడాకులు ఇచ్చాడని.. ఐతే పవన్ మూడో భార్య అనా లెజ్నెవాకు కూతురు పుట్టింది 2013లో అని.. మరి విడాకులు పొందిన రెండేళ్లకు మరో మహిళతో బిడ్డను కంటే దానిపై రేణుకు అభ్యంతరమేంటని.. ఆమె అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని.. ఒక అభిమాని ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు. మరోవైపు రేణు.. పవన్ నుంచి ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదని అంటుంటే.. ఈ అభిమాని పవన్ ఆమెకు రూ.6 కోట్ల భరణం ఇచ్చినట్లుగా చెబుతున్నాడు. ఇందులో వాస్తవమెంతో రేణు, పవన్‌లకే తెలియాలి.

పవన్ అభిమాని లేవనెత్తిన ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ రేణును టార్గెట్ చేస్తున్నారు మిగతా ఫ్యాన్స్. అయితే రేణు విషయంలో పవన్ అభిమానులు ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎంతైనా రేణు బాధిత మహిళ కాబట్టి సొసైటీ మొగ్గు ఆమె వైపే ఉంటుంది. రేణును రెచ్చగొట్టి విడాకులు, ఇతర అంశాలపై బయటకు రాని విషయాలపై ఆమె ఓపెనయ్యేలా చేస్తే నష్టం పవన్‌కే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు